Aspirants ఆశావహుల్లో ‘స్థానిక’ సందడి
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:49 PM
‘sthanika’ Buzz Among Aspirants స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు లోపు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతుండడంతో మన్యంలోని పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో రాజకీయ వేడి మొదలైంది. నాలుగు నియోజకవర్గాల్లోని ఆశావహులు అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికలపైనే చర్చ
రిజర్వేషన్లపై ఉత్కంఠ
అధిష్ఠానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు
పార్వతీపురం, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు లోపు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతుండడంతో మన్యంలోని పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో రాజకీయ వేడి మొదలైంది. నాలుగు నియోజకవర్గాల్లోని ఆశావహులు అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్‌తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేయాలను కుంటున్న వారు పార్టీ బీ ఫారాల కోసం మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు జరగకపోయినప్పటికీ పార్టీల మద్దతు ఎంతో అవసరం. అందుకే పలువురు రాజకీయ పార్టీల ఆశీస్సులు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కాగా బీ ఫారాలు లభించకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు.
జడ్పీ పీఠం ఎవరికో...
జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మన్యం ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ పరిధిలోనే ఉంది. అయితే త్వరలోనే పార్వతీపురం కేంద్రం జడ్పీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా 15 జడ్పీటీసీల పరిధిలో ఈ సారి ఎన్నికలు జరగ్గా.. జడ్పీ ప్రథమ అధ్యక్షుడి అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత దీనిపై సష్టత రానుంది.
పురపాలక సంఘాల్లో ..
ఈ సారి ప్రత్యక్ష పద్ధతిలో పురపాలక సంఘాల చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలతో పాటు పాలకొండ, నగర పంచాయతీలో చైర్మన్లు, ఇతర పదవులకు రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారవుతాయోనని ఇప్పటి నుంచే ఆశావహులు ఎదురు చూస్తున్నారు. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన జిల్లాలో ఒక పురపాలక సంఘం తప్పనిసరిగా బీసీకి ఖరారయ్యే అవకాశం ఉంది. సాలూరు పురపాలక సంఘానికి సంబంధించి వార్డుల పునర్విభజన అంశం కోర్టులో ఉంది. దీంతో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా కేంద్రం పార్వతీపురంతో పాటు పాలకొండ నగరపంచాయతీకి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అయితే ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఖరారవుతాయన్నది వేచి చూడాల్సి ఉంది.
కూటమికి అగ్నిపరీక్షే...
స్థానిక ఎన్నికలు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాలతో పాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలు స్థానిక ఎన్నికలకు ఒక రెఫరెండంగా ఉంటాయనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గ్రూప్‌ల మధ్య సయోధ్య కుదిరేనా...?
జిల్లాలోని 451 పంచాయతీలు ఉండగా.. అనేకచోట్ల కూటమి పార్టీల్లో రెండు నుంచి మూడు గ్రూప్‌లు ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా ఎవరికి వారే పోటీ చేయాలనుకుంటున్న నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వారి మధ్య సయోధ్య కుదురుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా ఈ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి దక్కే స్థానాలు బట్టీ ఆ పార్టీ బలమేమిటో తేలనుంది. సర్పంచ్‌లకు సంబంధించి ఆ పార్టీ మద్దతుదారులు పోటీ చేసే అవకాశం ఉంది.