Share News

‘తోటపల్లి’ పూర్తికి అడుగులు

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:33 PM

జిల్లాలో తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తు న్నారు.

‘తోటపల్లి’ పూర్తికి అడుగులు
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు

- ఎఫ్‌ఆర్‌ఎల్‌ లక్ష్యం 105 మీటర్లు

- ముంపు గ్రామాలను ఖాళీ చేయాల్సిందే

-మరో 47వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక

- స్ట్రక్చర్లు, డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్‌

- భూసేకరణతోనే ఇవన్నీ సాధ్యం

పార్వతీపురం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 105 మీటర్లు తప్పనిసరిగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కొన్ని గ్రామాలను తక్షణమే ఖాళీ చేయించాల్సి ఉంది. కొత్త ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలన్నా, మిగిలిన పనులు పూర్తి చేయాలన్నా భూసేకరణ ఎంతో కీలకం.


ఇదీ పరిస్థితి..

తోటపల్లి ప్రాజెక్టుకు 2003 నవంబరు 6న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి చేసేందుకు 12 ఏళ్లు పట్టింది. 2015 సెప్టెంబరు 10న అప్పటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలోని 27 గ్రామాలకు సంబంధించి 13,683 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 201 గ్రామాల్లోని 78,564 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 105 గ్రామాల్లోని 38,974 ఎకరాలు మొత్తంగా 1,31,221 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ, 84,035 ఎకరాలకు (పార్వతీపురం 5,238, విజయనగరం 55,446, శ్రీకాకుళం 23351) మాత్రమే నీరు అందుతుంది. మిగతా 47,186 ఎకరాలకు (పార్వతీపురం 8,445, విజయనగరం 23,118, శ్రీకాకుళం 15623) సాగునీరు అందించాలంటే పూర్తిస్థాయి పనులు చేపట్టాల్సి ఉంది. దీనికోసం భూసేకరణ చేపట్టడంతో పాటు నిర్వాసితుల సమస్యలు తదితర వాటిపై దృష్టిసారించాల్సి ఉంది. అయితే, ఒక్క టీడీపీ ప్రభుత్వం తప్పా కాంగ్రెస్‌, వైసీపీ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకున్న పాపానపోలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో పనులు వేగవంతంగా జరగడంతో కొత్త ఆయకట్టుకు సంబంధించి 72,855 ఎకరాలకు సాగునీరు అందింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మరో 11,180 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించే పనులు జరిగాయి.


భూసేకరణ ఇలా..

జిల్లాలోని సీతానగరం, బలిజిపేట మండలాల పరిధిలో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. సీతానగరం మండలం జగన్నాథ పురం, జయంతిపురం, బూర్జ, పి.బుచ్చుంపేట, గాదిలవలస, బలిజిపేట మండలం పలుకువలస, అరసాడ, రల్లి, మిర్చివలస, భైరిపురం, పెదపెంకి, జనార్ధనపురం, శివరాంపురం, వెంగళరాయ పురం, అపావలి గ్రామాల పరిధిలో జిరాయితీ భూమి సుమారు ఐదున్నర ఎకరాలు, డీ పట్టా సుమారు 34 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణ చేపడితే స్ట్రక్చర్‌ పనులతో పాటు డిస్ట్రిబ్యూటర్‌ పనులు పూర్తవుతాయి. 426 స్ట్రక్చర్లకు గాను 33 స్ట్రక్చర్లు మా త్రమే నిర్మించారు. ఇంకా 393 స్ట్రక్చర్లతో పాటు తొమ్మిది డిస్ట్రిబ్యూ టర్‌ నిర్మించాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితేనే ఈ పనులకు ఎటువంటి ఆటంకం ఉండదు. కాగా, మారిన నిబంధన ప్రకారం డిపట్టా భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. దీంతో నష్ట పరిహారం కోసం డిపట్టాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. అందువల్ల పనులు ముందుకు వెళ్లడం లేదు.


ఈ గ్రామాలను ఖాళీ చేయాల్సిందే..

ప్రాజెక్టు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)105 మీటర్లు. కానీ, అత్యధికంగా 103 మీటర్లు వరకు నీటి నిల్వలు ఉంటున్నాయి. ముంపు గ్రామాలను ఖాళీ చేయకపోవడంతో ఎప్పుడు కూడా నీటి నిల్వలు 105 మీటర్లు ఉండడం లేదు. ఈ నేపథంలో ముంపు గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జియమ్మవలస మండలంలోని బాసంగి, గజబవలస, పీఆర్‌ఎన్‌వలస, దుగ్గి, పత కళ్లికోట, బిత్రపాడు గ్రామాలను తప్పనిసరిగా ఖాళీ చేయాలి. ఒడిశాలో అధిక వర్షాలు కురిసిన సమయంలో తోటపల్లికి వరద పోటెత్తుతుంది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ 103 మీటర్లకు చేరేసరికి నిర్వాసిత గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వరదల సమయంలో బాసంగి గ్రామంలోకి నీరు వచ్చేస్తుంటుంది. ఈ గ్రామాలు ఖాళీ కావాలంటే నిర్వాసితులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. మరోపక్క పోలవరం ప్రాజెక్టు స్థాయి ప్యాకేజీ తమకు ఇవ్వాలని, వలస వెళ్లిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు.


2,637 గృహాలు మాత్రమే పూర్తి..

తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాల్లో 5,629 గృహాలను నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,637 ఇళ్లు మా త్రమే పూర్తయ్యాయి. బాసంగి, గజబవలస నిర్వాసిత గ్రామాలకు సంబంధించి చింతల బెలగాం, బట్లభద్ర గ్రామాల వద్ద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ, ఈ రెండు గ్రామాల నిర్వాసితులు అక్కడకు వెళ్లడం లేదు. 384 నిర్వాసిత కుటుంబాలకు కేవలం 184 మంది మాత్రమే పట్టాలు తీసుకున్నారు. వీరు కూడా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం 8 మంది మా త్రమే పునాదులు వేశారు. ఇళ్ల స్థలాలు తమ వ్యవసాయ భూములకు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయని, అందుకే అక్కడకు వెళ్లడం లేదని నిర్వాసితులు చెబుతున్నారు.

మరొకసారి జాతికి అంకితం...

ఈ ప్రాజెక్టు ద్వారా మరో 47,186 ఎకరాలకు సాగునీరు అందిం చేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఈ పనులను శరవేగంగా పూర్తిచేసి మరొకసారి ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ కార్యక్రమం వచ్చే నెలలో చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 25 , 2026 | 11:33 PM