వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్ల స్థాపనకు చర్యలు: కలెక్టర్
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:19 AM
జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్లను స్థాపించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్లను స్థాపించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ 30 యూనిట్లు నమోదు చేసినట్టు చెప్పారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల లక్ష్యం 42 కాగా, 14 మాత్రమే నిర్వహించారని పెదవి విరిచారు. 30వ తేదీలోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించకపోతే ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రతి మండలంలోని ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువతను గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్ పాల్గొన్నారు.
2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి ..
జిల్లాలో వచ్చేఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. రీసర్వే అంశాలపై ఆయా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా సానుకూల దృక్పథం సర్వేలో రెవెన్యూకు సంబంధించి సర్వే సర్టిఫికెట్లు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సర్వే తరువాత తప్పని సరిగా సర్టిఫికెట్ అందించాలని స్పష్టం చేశారు. వంట గ్యాస్‌కు సంబందించి అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదు ర్కొంటున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో జేసీ సేతు మాధవన్, డీఆర్‌వో సత్తిబాబు తదితరులు ఉన్నారు.
దత్తత త్వరగా పూర్తి చేయాలి..
జిల్లాలోని బంగారు కుటుంబాలు దత్తత ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. మండల స్దాయి అఽధికారులుతో నిర్వహించచిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకూ జిల్లాలో 82,426 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. వీరిలో ఇప్పటి వరకూ 3,941 మంది మార్గదర్శకుల ద్వారా 20,157 కుటుంబాల దత్తత పూర్తయ్యిందని చెప్పారు. మిగిలిన కుటుంబాలను వెంటనే దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 8,015 చెరువులు ఉండగా, ఇప్పటి వరకూ 4,276 చెరువుల తనిఖీ మాత్రమే జరిగిందని... వెంటనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పారు. ఉపాధి హామీ పధకం క్రింద ఇప్పటి వరకూ 11,818 పనులకు ఆమోదం తెలపగా... జలధార కార్యక్రమం కోసం 8,655 పనులను మాత్రమే గుర్తించారని చెప్పారు. ఈ తేడాను వెంటనే సరిచేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీవో బాలాజీ, డ్వామా పీడీ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.