Agency Area ఏజెన్సీలో గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:21 AM
Steps to Accelerate House Construction in the Agency Area సీతంపేట ఏజెన్సీలో పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ పీడీ ధర్మరాజు ఆదేశించారు. బుధవారం రశూల్‌పేట, కిండంగి గ్రామాలను సందర్శించారు.
సీతంపేట, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ పీడీ ధర్మరాజు ఆదేశించారు. బుధవారం రశూల్‌పేట, కిండంగి గ్రామాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన గృహాల ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం హౌసింగ్, సచివాలయ సిబ్బందికి పలు అంశాలపై సూచనలిచ్చారు. మండలంలో పీఎం జన్‌మన్ పథకం కింద 1749 గృహాలు మంజూరు కాగా 303 ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభంకాలేదన్నారు. గ్రౌండింగ్ కాని గృహాల లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తక్షణమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఏఈ వెంకటేష్‌కు సూచించారు. పనులు ప్రారంభిస్తే సకాలంలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పీఎం జన్‌మన్ పథకం లబ్ధిదారులకు మొత్తంగా రూ.2.39 లక్షల ఆర్థికసహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణాల ప్రగతిని వేగవంతం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాలకొండ, వీరఘట్టం తదితర మండలాల్లో పనిచేస్తున్న హౌసింగ్ ఉద్యోగులను సీతంపేట తీసుకొచ్చి లబ్ధిదారులకు పథకం వివరాలు, నిర్మాణ ప్రక్రియ, ప్రభుత్వం ఆర్థికసహాయంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి... గృహ నిర్మాణాలు ఇంకా ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడాలని పీడీ ఆదేశించారు.