Neradi Barrage Construction నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడుగులు
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:21 AM
Steps Taken Towards Neradi Barrage Construction దీర్ఘకాలంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదంలో నలుగుతున్న నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.614 కోట్లు కేటాయించారు.
ఉమ్మడి జిల్లా రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
భామిని, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదంలో నలుగుతున్న నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.614 కోట్లు కేటాయించారు. దీంతో వంశధార ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఒడిశా యంత్రాంగంతో సంప్రదింపులు చేస్తున్నారు. మరో వంశధార నదీజలాల వినియోగంపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
- భామిని మండలం కాట్రగడ-నేరడికి మధ్యలో వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి 1962లో బీజం పడింది. పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టాబ్యారేజ్ నిర్మాణానికి ముందే 1969లో నేరడి బ్యారేజీ పనులు ప్రారంభించారు. అయితే ఒడిశా అభ్యంతరాలతో ఆ నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గొట్టా బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసింది. కుడి కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస, సరుబుజ్జిలి ప్రాంతాలకు సాగునీరు అందించింది. అనంతరం టీడీపీ ప్రభుత్వం ఎడమ కాలువ పూర్తి చేసి.. టెక్కలి, నరసన్నపేట వరకు వంశధార నదిజలాలు అందించింది. రిజర్వాయర్ లేకపోవడంతో వంశధార నది నుంచి వంద టీఎంసీల వదరనీరు సముద్రంలో కలుస్తుంది. దీంతో 1995లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం ఎన్టీఆర్, ఒడిశా సీఎం బిజూ పట్నాయక్‌తో సమావేశమై.. నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వంశధారలో 105 టీఎంసీల నీటిని సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు చెరిసగం వినియోగించాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయిన ప్పటికీ ఒడిశా ప్రభుత్వం మోకాలడ్డడంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి బ్రేక్ పడింది.
- జలయజ్ఞం పథకం కింద 2006లో వరద నీటి మళ్లింపు కోసం ప్రయత్నం చేయగా.. ఒడిశా ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఆ పనులు ఆగిపోయాయి. 2014 తర్వాత దీనిపై కదలిక వచ్చింది. వరదకాలువపై ట్రిబ్యూనల్ ఏపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆఘమేఘాలతో టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. మరో రూ.800 కోట్లు అదనంగా ఇచ్చింది. 90 శాతం పనులు 2019 నాటికి పూర్తి చేశారు. వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌కు 2018లో ఎనిమిది టీఎంసీల నీరు పంపారు.
- వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరద కాలువ పనులు ముందుకు సాగలేదు. బడ్జెట్‌లో రెండు పర్యాయాలు రూ.వంద కోట్లు కేటాయించినట్టు ప్రకటించినా ..నిర్మాణాలు మాత్రం జరగలేదు. వరద కాలువ ద్వారా నీటి మళ్లింపు ఆశాజనకంగా లేకపోవడంతో ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదలనతో నేరడి బ్యారేజీ నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించడంతో అధికారులు పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాది నవంబరులో సీఎంతో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఒడిశాకు నేరడి బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా నీరు అందనుండడంతో 106 ఎకరాల భూసేకరణకు కసరత్తు ప్రారంభించింది.
- నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే మన్యం జిల్లా భామిని మండలంలో పది వేల ఎకరాలతో సాగునీరందనుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో సాగు, తాగునీరుకు ఢోకా ఉండదు.
వంశధార ఎస్‌ఈ ఏమన్నారంటే..
‘ఒడిశా ప్రభుత్వం సేకరించాల్సిన 106 ఎకరాలకు సంబంధించి గజపతి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. వరదల కారణంగా ఉభయ జిల్లాల అధికారులు సమావేశం వాయిదా పడింది. త్వరలో సమావేశం నిర్వహించి భూ సేకరణ, ఇతర అంశాలపై చర్చిస్తాం. సీడబ్ల్యూసీ ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ మేరకు అక్కడ ప్రభుత్వం భూసేకరణ చేయనుంది. దీనికి ఏపీ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఒడిశా వైపు కేవలం సేఫ్టీ వాల్ నిర్మాణం జరుగుతుంది. నేరడి బ్యారేజ్ నిర్మిండం ద్వారా నీరు నిల్వ ఉండదు. ’ అని వంశధార ఎస్‌ఈ రామచంద్రరావు తెలిపారు.