Share News

Anganwadi Posts అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి చర్యలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:35 PM

Steps Taken to Fill Anganwadi Posts జిల్లాలో 263 అంగన్‌వాడీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం పార్వతీపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  Anganwadi Posts   అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి చర్యలు
వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 263 అంగన్‌వాడీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం పార్వతీపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ.. వందేళ్లు పూర్తి చేసుకున్న ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఆలయ అభివృద్ధికికి సహకరిస్తానని చెప్పారు. మినీ సెంటర్లను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేశామని, అందులో పనిచేసిన ఆయాలంతా కార్యకర్తలుగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. జిల్లాలోని బలిజిపేట, సాలూరు, భామిని, పాలకొండ, కొమరాడ ప్రాజెక్టుల పరిధిలో 31 పోస్టులు , పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న భద్రగిరి, పాచిపెంట, పార్వతీపురం, కురుపాం, కొమరాడ ప్రాజెక్టుల పరిధిలో 175 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు మంత్రి చెప్పారు.

కమిటీల ఆధ్వర్యంలో..

నిబంధనల ప్రకారం.. అంగన్‌వాడీ పోస్టులను ఆగ్రామానికి చెందిన కోడళ్లకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇందుకోసం మూడు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. బలిజిపేట, సాలూరు, భామిని, పాలకొండ, కొమరాడ మండలాలకు సంబంధించి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. భద్రగిరి, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, కొమరాడ, కురపాం మండలాలకు సంబంధించి పార్వతీపురం ఐటీడీఏ పీవో చైర్మన్‌గా వ్యవహ రిస్తారు. సీతంపేట పరిధిలో అక్కడి ఐటీడీఏ పీవో చైర్మన్‌గా ఉంటారు. కాగా పోస్టులు భర్తీకి సంబంధించి మే 14 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:35 PM