వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అడుగులు
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:21 AM
Steps Taken to Construct a Barrage Across the Vamsadhara River ఏవోబీ సరిహద్దుల్లో వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. శుక్రవారం ఎస్ఈఈ ఇంజనీర్ భవానీశంకర్, ఏఈఈలు సత్యనారాయణ, జగదీష్‌తో పాటు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. మొదటగా ఒడిశా వైపు వంశధార నది పరివాహక ప్రాంతాల్లోని వివిధ ప్రదేశాల్లో మొత్తం ఎనిమిది పాయింట్లను గుర్తించారు.
భామిని, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏవోబీ సరిహద్దుల్లో వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. శుక్రవారం ఎస్ఈఈ ఇంజనీర్ భవానీశంకర్, ఏఈఈలు సత్యనారాయణ, జగదీష్‌తో పాటు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. మొదటగా ఒడిశా వైపు వంశధార నది పరివాహక ప్రాంతాల్లోని వివిధ ప్రదేశాల్లో మొత్తం ఎనిమిది పాయింట్లను గుర్తించారు. నదీతీరాలు, భౌగోళిక పరిస్థితులు, బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన భూమి విస్తీర్ణంపై కచ్చితమైన వివరాలు సేకరించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. అనంతరం వారు భామిని మండలంలోనూ సర్వే నిర్వహించారు. ఈ నెల 28న ఇరు రాష్ర్టాల పరిధిలో డ్రోన్ సర్వే చేపట్టనున్నట్టు వారు తెలిపారు. ఒడిశా వైపు భూముల వివరాలు, రైతుల ప్రయోజనాలు, నదీతీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత వంటి కీలక అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామన్నారు. కాగా గెజిట్‌లో పేర్కొన్న మేరకు బ్యారేజీ నిర్మాణం కోసం ఒడిశా సరిహద్దులో 106 ఎకరాలను సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన భూసేకరణ, నష్టపరిహారం ఖర్చులను రాష్ట్ర సర్కారే భరించాల్సి ఉండడంతో అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు.