Sports Coaching Center స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:13 AM
Steps Initiated to Set Up a Sports Coaching Center రావాడ రామభద్రపురం గ్రామ సమీపంలో స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) కె.శ్రీధర్‌రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆ స్థలాన్ని పరిశీలించారు.
జూన్‌లోగా పనులు చేపట్టకుంటే సాగు చేపడతామని భూదాతల వెల్లడి
జియ్యమ్మవలస, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రావాడ రామభద్రపురం గ్రామ సమీపంలో స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) కె.శ్రీధర్‌రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆ స్థలాన్ని పరిశీలించారు. క్రీడల కోసం దాతలు ఇచ్చిన భూమి అత్యంత విలువైనదని, మరో వారం రోజుల్లో మొత్తం స్థలాన్ని శుభ్రం చేయిస్తామని ఆయన తెలిపారు. క్రీడలపై తర్ఫీదు ఇచ్చేందుకు ఇద్దరు శిక్షకులను నియమిస్తామని, వారి కోసం భవన నిర్మాణానికి ఎస్టిమేట్లు వేయిస్తామని చెప్పారు. ‘క్రీడా పాఠశాల కోసం రెండు దశాబ్దాల కిందట మేము 10.71 ఎకరాలను దానంగా ఇచ్చాం.. ఇప్పటివరకు ఎటువంటి పనులు చేపట్టకపోవడం దారుణం.’ అని ఆ గ్రామానికి చెందిన పది మంది గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ లోపు పనులు చేపట్టకుంటే ఆ భూమిలో సాగు చేస్తామని వారు డీఎస్‌డీవో ముందు తెగేసి చెప్పారు. మరోవైపు గిరిజనాభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ నాలుగు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ వేశారని, తరువాత అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారిందని తెలిపారు. దీనిపై డీఎస్‌డీవో మాట్లాడుతూ.. ట్రాక్ వినియోగంపై దృష్టి సారిస్తా మన్నారు. క్రీడా పాఠశాల ఏర్పాటు విషయాన్ని కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. ఆయన వెంట పీడీలు వాసుదేవరావు, చంద్ర, గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎన్.తిరుపతి, పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.