ఒడ్డున ఉండి.. ప్రాణాలతో బయటపడి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:28 AM
: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు వద్ద గోదావరి నదిలో స్నానం కోసం దిగిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
- ఏలూరు ఘటనలో జిల్లా యువకుడికి తప్పిన ప్రమాదం
విజయనగరం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు వద్ద గోదావరి నదిలో స్నానం కోసం దిగిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే, వీరితో పాటు వెళ్లిన విజయనగరానికి చెందిన హర్షవర్థన్ స్నానం కోసం దిగకుండా నది ఒడ్డున ఉండి పోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న వీరంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో సరదాగా గడిపేందుకు ట్రిప్ వేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం హర్షవర్థన్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు ఏలూరు వెళ్లారు. అక్కడ గోదావరి నదిలో స్నానం చేసేందుకు ఆరుగురు విద్యార్థులు దిగారు. నదీ ప్రవాహం ఎక్కువ కావడం, నీటి లోతును అంచనా వేయకపోవడంతో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి ఆచూకీ దొరకలేదు. మరో యువకుడు కష్టంగా ఈదుకుంటూ బయటపడ్డాడు. హర్షవర్థన్ నదిలోకి దిగకుండా ఒడ్జున ఉండిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.