Share News

‘స్వచ్ఛాంధ్ర’లో రాజాం, బొబ్బిలికి రాష్ట్రస్థాయి అవార్డులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:27 AM

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజాం, బొబ్బిలి మున్సిపాలిటీలు రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యాయి.

‘స్వచ్ఛాంధ్ర’లో రాజాం, బొబ్బిలికి   రాష్ట్రస్థాయి అవార్డులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అవార్డులు అందుకుంటున్న రాజాం, బొబ్బిలి మున్సిపల్‌ కమిషనర్లు రామచంద్రరావు, లాలం రామలక్ష్మి

- సీఎం చంద్రబాబు నుంచి అందుకున్న మున్సిపల్‌ కమిషనర్లు

రాజాం/రూరల్‌/బొబ్బిలి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజాం, బొబ్బిలి మున్సిపాలిటీలు రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.రామచంద్రరావు, బొబ్బిలి కమిషనర్‌ లాలం రామలక్ష్మి అవార్డులను అందుకున్నారు. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన పట్టణాలకు ఇచ్చే విభాగంలో ఈ రెండు మున్సిపాలిటీలకు అవార్డులు వరించాయి. పారిశుధ్యం నిర్వహణ, ఘనవ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం వంటి వివిధ అంశాల్లో రాజాం మున్సిపాలిటీకి, ఇంటింటి చెత్తసేకరణ, మిద్దె తోటల పెంపకం, సేకరించిన చెత్తాచెదారాలను స్థానికంగా శాగ్రిగేషన్‌ చేయడం, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్‌ నిషేధం, సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ వంటి అంశాల్లో బొబ్బిలి పురపాలక సంఘానికి అవార్డులు దక్కాయి. కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అవార్డులు దక్కడంపై కమిషనర్లకు సంబంధిత మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు. కాగా, బొబ్బిలికి వరుసగా రెండో ఏడాది దక్కించుకుంది. మూడోసారి కూడా అవార్డును సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని కమిషనర్‌ను ప్రభుత్వ పెద్దలు ఆశీర్వదించారు.

సమష్టి కృషికి దక్కిన ఫలితం

బొబ్బిలి మున్సిపాలిటీకి అవార్డు దక్కడానికి ప్రథమ కారణం సమష్టి కృషి. స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన, ఇతర ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించి మున్సిపాలిటీకి ఎంతగానో సహకరిస్తున్నారు. పట్టణ ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉండడంతో ఏమి చెప్పినా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఇటీవల మిద్దెతోటల పెంపకం విషయంలో చాలా మంది స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తాం.

-లాలం రామలక్ష్మి, కమిషనర్‌, బొబ్బిలి

Updated Date - Oct 03 , 2026 | 12:27 AM