Share News

Farmers' markets: సిబ్బంది రారు.. రైతులు ఉండరు

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:00 AM

Farmers' markets: జిల్లా కేంద్రం విజయనగరంలో రింగ్‌రోడ్డు, ఎంఆర్‌హెచ్‌లో రైతు బజార్లు ఉన్నాయి.

Farmers' markets:  సిబ్బంది రారు.. రైతులు ఉండరు
రైతుబజార్‌ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సిబ్బంది కుర్చీలు

- రైతుబజార్ల నిర్వహణ అధ్వానం

- ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

- ఇదీ నగరంలోని రైతుబజార్ల పరిస్థితి

విజయనగరం టౌన్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం విజయనగరంలో రింగ్‌రోడ్డు, ఎంఆర్‌హెచ్‌లో రైతు బజార్లు ఉన్నాయి. రింగురోడ్డు రైతుబజారులో 37మంది రైతులు, ఎంఆర్‌హెచ్‌ రైతు బజారులో 30 మంది రైతులు ఉన్నారు. కొన్ని నెలల కిందట ఎంఆర్‌హెచ్‌ రైతు బజారును అధికారులు ఖాళీ చేయించి రింగ్‌రోడ్డు రైతుబజారులో విలీనం చేశారు. అయితే, ఈ రైతుబజార్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావడం లేదు. రైతులు కూడా దుకాణాలు తెరవకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 దాటినా రైతులు బజార్లకు రావడం లేదు. అలాగే సంబంధిత కార్యాలయాల సిబ్బంది అయిన ఈవోలు, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు ఏ ఒక్కరూ కూడా ప్రతిరోజూ 9.30 అయినా విధులకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతుబజార్లలో ఉన్న సూపర్లవైజర్లను డిప్యుటేషన్‌పై ఏడీ కార్యాలయానికి అధికారులు నియమించారు. వారికి వేరే వ్యాపారాలు ఉండడంతో నచ్చినప్పుడు రైతుబజార్లకు వస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎంఆర్‌హెచ్‌ రైతుబజార్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్నప్పుడు నిత్యం రైతులు, వినియోగదారులతో కిటకిటలాడుతుండేది. ఇప్పుడు దాన్ని ఖాళీ చేయించి రింగురోడ్డు రైతుబజార్‌లో విలీనం చేసిన తరువాత రైతుల సంఖ్యతో పాటు వినియోగదారులు కూడా తగ్గిపోయారు. వ్యాపారాలు కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ విషయమై వివరణ కోరేందుకు సంబంధిత ఏడీకి పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ చేసినా ఆయన స్పందించలేదు. ఇదే విషయమై సంయుక్త కలెక్టర్‌ సేతుమాధవన్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. తక్షణమే ఏడీకి ఆదేశాలు జారీచేసి రైతుబజార్ల నిర్వహణపై నివేదిక అడుగుతానని అన్నారు

సిబ్బంది రావడం లేదు

రింగురోడ్డు, ఎంఆర్‌హెచ్‌ రైతుబజార్ల సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు. రైతుబజార్లలో ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేద్దామని ఈవో కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండడం లేదు. సిబ్బంది రాకపోవడంతో రైతులు కూడా నచ్చిన ధరలకే కూరగాయలను విక్రయిస్తున్నారు.

-సాగి సాయిబాబు, డైరక్టర్‌, ఏఎంసీ, విజయనగరం

తాజా కూరగాయలు ఉండడం లేదు

ఈ రెండు రైతుబజార్లలో తాజా కూరగాయలను విక్రయించడం లేదు. ప్రశ్నించే వారికే బోర్డుపై ఉన్న ధరల ప్రకారం అమ్ముతున్నారు. అడగని వారికి నచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఈవో కార్యాలయానికి వెళ్తే అక్కడ కుర్చీలు తప్పా సిబ్బంది ఉండడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది.

పి.భాస్కరరావు, దాసన్నపేట, ప్రభుత్వ ఉద్యోగి

Updated Date - Mar 01 , 2026 | 12:00 AM