Staff Shortage.. సిబ్బంది కొరత.. సేవలకు వెత!
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:25 PM
Staff Shortage.. Services Hit సీతంపేట ఏజెన్సీలో రైతు సేవా కేంద్రాలు సిబ్బంది కొరతతో అల్లాడుతున్నాయి. గిరిజన రైతులకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్‌లో వారికి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ఏజెన్సీలో ఉన్న 31 సచివాల యాల పరిధిలో ఏడు ఆర్‌ఎస్‌కేలు నడుస్తున్నాయి.
సకాలంలో అందని విత్తనాలు, యూరియా
గిరిజన రైతులకు తప్పని ఇబ్బందులు
పట్టించుకోని ఉన్నతాధికారులు
సీతంపేట, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో రైతు సేవా కేంద్రాలు సిబ్బంది కొరతతో అల్లాడుతున్నాయి. గిరిజన రైతులకు భరోసా కల్పించలేకపోతున్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్‌లో వారికి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ఏజెన్సీలో ఉన్న 31 సచివాల యాల పరిధిలో ఏడు ఆర్‌ఎస్‌కేలు నడుస్తున్నాయి. వాటిల్లో ఆరుగురు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ)లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్(వీహెచ్‌ఏ) మాత్రమే విధులు నిర్వహి స్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న గిరిజన రైతులకు ఆర్‌ఎస్‌కేల ద్వారా సకాలంలో విత్తనాలు, యూరియా వంటివి సకాలంలో అందడం లేదు. మొత్తంగా ఏజెన్సీలో వ్యవసాయ శాఖ తీరుపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
ఇదీ పరిస్థితి
- మండలంలో గతంలో 29 రైతు భరోసా కేంద్రాలు నడిచేవి. అప్పట్లో 14మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు మాత్రమే పనిచేసేవారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌బీకే(రైతు భరోసా కేంద్రాల)ను ఆర్‌ఎస్‌కే(రైతు సేవా కేంద్రాలు)గా మార్పు చేసింది. అయితే 2024-25లో చేపట్టిన రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ప్రక్రియలో ఏడు పోస్టులు మాత్రమే మండలానికి కేటాయించారు. దీంతో సీతంపేట ఏజెన్సీలోని గిరిజన రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆర్‌ఎస్‌కేల ద్వారా గిరిజన రైతులకు పూర్తి స్థాయిలో సేవలందడం లేదు. వ్యవసాయశాఖ సిబ్బంది కొరత కారణంగా గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఈఖరీఫ్ సీజన్‌లో డిప్యుటేషన్‌పై ఎంపీఈవోలు, ఏఈవోలను నియమించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
- సీతంపేట మండలంలో 7వేల ఎకరాల్లో గిరిజన రైతులు వ్యవసాయం చేస్తున్నారు. మరో 35వేల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు చేపడుతున్నారు. ఇంత పెద్ద విస్తీర్ణంలో ఏజెన్సీలో గిరిజన రైతులు పంటలు పండిస్తున్నా.. ఖరీఫ్, రబీ సీజన్లలో వారికి సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. దీంతో వారికి సాగులో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కూడా గిరిజన రైతులను కుంగదీస్తున్నాయి.
ఏడీ ఏమన్నారంటే...
‘గతంలో జరిగిన రేషనలైజేషన్‌లో భాగంగా చాలా వరకు పోస్టులు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిపోయాయి. దీంతో మన్యంలో పోస్టులు తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఉన్న సిబ్బందితో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం.’ అని వ్యవసాయశాఖ ఏడీ(అసిస్టెంట్ డైరెక్టర్)రత్నకుమారి తెలిపారు.