Forests సిబ్బంది కొరత.. అడవులకేదీ భద్రత?
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:58 PM
Staff Shortage Puts Forests at Risk జిల్లాలో అటవీ శాఖకు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అడవుల సంక్షరణ ప్రశ్నార్థకంగా మారింది. మన్యంలో 1,02,784 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి.
ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం
కొరవడిన పర్యవేక్షణ
ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం
ఒడిశాకు తరలిపోతున్న విలువైన అటవీ సంపద
జియ్యమ్మవలస, జూలై15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ శాఖకు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అడవుల సంక్షరణ ప్రశ్నార్థకంగా మారింది. మన్యంలో 1,02,784 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. కురుపాం, పాలకొండ, సాలూరు, పార్వతీపురంలలో అటవీశాఖ రేంజ్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ నాలుగు రేంజ్‌ల పరిధిలో మొండెంఖల్, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పార్వతీపురం, వీరఘట్టాం, కొత్తూరు, సరుబుజ్జిలి, పాలకొండ, సాలూరు, పాచిపెంట, మామిడిపిల్లి, మక్కువతో కలిసి 13 సెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 53 బీట్లు కూడా ఉన్నాయి. కానీ కావల్సిన సిబ్బంది మాత్రం పూర్తిస్థాయిలో లేరు. దీంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. విలువైన అటవీ సంపద సరిహద్దులు దాటి ఒడిశాకి తరలిపోతోంది.
సిబ్బంది పరిస్థితి ఇదీ..
సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం రేంజ్ పరిధిలోని 13 సెక్షన్ల పరిధిలో 13 మంది సెక్షన్ అధికారులు ఉన్నారు. ఈ నాలుగు రేంజ్ పరిధిలో 53 బీట్లు ఉండగా ఫారెస్ట్ బీటు ఆఫీసర్లు 29 మందే ఉన్నారు. అసిస్టెంట్ ఫారెస్ట్ బీటు ఆఫీసర్లు కేవలం ఐదుగురే ఉన్నారు. వాస్తవానికి ఒక్కో బీటుకు ఒక ఫారెస్టు బీటు ఆఫీసర్, ఒక అసిస్టెంట్ బీటు ఆఫీసర్ ఉండాలి. అంటే ఈ నాలుగు రేంజ్‌ల పరిధిలో 68 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
ఇబ్బందులు ఇలా..
జిల్లా పరిధిలోని అటవీ రేంజ్‌లలో బీట్, అసిస్టెంట్ బీట్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. మొత్తంగా 72 ఖాళీలు ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రస్తుతం విధులు నిర్వ ర్తిస్తున్న సిబ్బందిపై అదనపు పనిభారం తప్పడం లేదు. ఇదే అదునుగా కొందరు ఫారెస్ట్ భూము లను ఆక్రమిస్తున్నారు. మరికొందరు అడవుల్లో విలువైన టేకు చెట్లు, ఔషధ మొక్కలు తదితర వాటిని మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇకపోతే ఫారెస్ట్ భూముల్లో అనుమతి లేకుండా మామిడి, జీడి మొక్కలు నాటుతున్న వారికి అటవీశాఖ సిబ్బందే కొందరు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఏనుగుల జాడ తెలుసుకోవడం, వాటి కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందేలా చూడడానికి ఒక సెక్షన్ అధికారి లేకపోవడం వల్ల పర్య వేక్షణ కొరవడుతోంది. అడవులు విస్తీర్ణం తగ్గుతుండటం వల్ల వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండాపోతోంది. అవి మైదాన ప్రాంతాలకు రావడం వల్ల వేటగాళ్ల చేతిలో బలవుతున్నాయి. తద్వారా వన్యప్రాణుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది.
ప్రభుత్వం దృష్టిలో ఉంది
అటవీశాఖలో పోస్టుల భర్తీ విషయం ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. దీనిపై తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నాం.
- డి.గంగరాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, కురుపాం రేంజ్