క్రీడా మైదానాల్లేవ్!
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:30 AM
జిల్లాలో క్రీడా మైదానాలు లేకపోవడంతో క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు.
- నిలిచిన మిని స్టేడియాల పనులు
-క్రీడాకారులకు తప్పని ఇబ్బందులు
- భామిని, సీతంపేటలో క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
- నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
పార్వతీపురం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడా మైదానాలు లేకపోవడంతో క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. సాధన చేసేందుకు సరైన మైదానాలు లేక ఇళ్లపక్క ఉన్న ఖాళీ స్థలాలు, పొలాలను ఆటస్థలాలుగా వినియోగిస్తున్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి అవకాశాలు ఉన్నప్పటికీ గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు కదల్లేదు. గత టీడీపీ ప్రభుత్వం కాలంలో మంజూరైన పనులు కూడా చేపట్టకుండా వదిలేశారు. దీంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
- జియ్యమ్మవలస మండలం ఆర్‌ఆర్‌బీపురంలో గత టీడీపీ ప్రభుత్వంలో మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించారు. అయితే, నిధుల కొరత వల్ల పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. గతంలో రూ.8 లక్షలతో 400 మీటర్ల ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత నిధులు మంజూరు కాకపోవడంతో మినీ స్టేడియం పనులు నిలిచిపోయాయి.
- గుమ్మలక్ష్మీపురంలో కూడా మినీ స్టేడియం పనులు ఆగిపోయాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఈ పనులు ప్రారంభించారు. తర్వాత వచ్చిన వైసీపీ పాలకులు పట్టించుకోక పోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇటీవల మినీ స్టేడియం పనులు పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం రూ.3కోట్లు మంజూరు చేసింది. త్వరలో పనులు జరగనున్నాయి.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆలోచనతో భామిని మండలం మనుమకొండలోని జీటీడబ్ల్యూఎస్ పాఠశాలలో బాలికల కోసం, సీతానగరం మండలం జోగిపేట స్కూల్ ప్రాంగణంలో బాలుర కోసం క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ రెండు పాఠశాలల్లో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులకు వారికి ఆసక్తిగల క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వీటికోసం రూ.2.30కోట్లు నిధులు అవసరమని ప్రభు త్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నిధులు మంజూరైతే రన్నింగ్ ట్రాక్‌తో పాటు అనేక పనులకు మోక్షం లభిస్తుంది.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
గుమ్మలక్ష్మీపురంలో మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పిలిచాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. కలెక్టర్ ఆదేశాలతో భామిని, సీతానగరం మండలాల్లో క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. నెల్లి చెరువు ప్రాంతంలో మినీ స్టేడియం ఏర్పాటుకు గతంలో అనుమతులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
కె.చక్రధరరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి