speeady వడివడిగా..
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:35 PM
speeady శృంగవరపుకోట మండలంలోని జిందాల్ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్కుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ఉన్నత స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి.
వడివడిగా..
జిందాల్ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ
ఏర్పాట్లలో అధికారులు
క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఏపీఐఐసీ ఎండీ దీనేష్‌కుమార్
లోకల్ అథారిటీ(ఐయిలా)లోకి తీసుకురావాలని సూచన
శృంగవరపుకోట, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట మండలంలోని జిందాల్ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్కుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ఉన్నత స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి. భూమి పూజకు సీఎం చంద్రబాబు వస్తారని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. రెవెన్యూ అధికారులూ వారి ఏర్పాట్లలో వారున్నారు. తాజాగా క్షేత్ర స్థాయిలో పరిశీలనకు ఏపీఐఐసీ ఎండీ దీనేష్‌కుమార్ వచ్చి అధికారులతో మాట్లాడారు. ఇండస్ట్రీయల్ పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం జెట్‌వేగంతో ప్రయత్నిస్తోందనడానికి శనివారం ఉదయం ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పర్యటనే నిదర్శనం. జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్ పార్కు యాజమాన్యం కూడా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇండస్ట్రీయల్ పార్కు నమూనాను స్థానికంగా అందుబాటులో ఉంచింది. ఏపీఐఐసీ ఎండీకి ఇక్కడి పార్కులో ఏర్పాటు చేయనున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థలాలు, ప్రాజెక్టుల గురించి జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్ పార్కు హెడ్ విక్టర్ వినోద్ వివరించారు. పుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్కులో ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాలు, హద్దులను తెలియజేశారు. విశాఖ జిల్లా పరిధిలోని మేఘాద్రి గెడ్డనుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఐయిలాలోకి తీసుకురావాలి
ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేయనున్న జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్ పార్కును ఇండస్ట్రీయల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐయిలా)లోకి తీసుకురావాలని ఏపీఐఐసీ ఎండీ దినేష్‌కుమార్ సూచించారు. ఐయిలా బాడీ ఉంటే పారిశ్రామిక మౌలిక సదుపాయాల సాధనకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. జిందాల్ యాజమాన్యం కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు యాజమాన్య ప్రతినిధులు బదులిచ్చారు. జిందాల్‌కు ఈ భూములు ఎలా వచ్చాయో తహసీల్దార్ డి.శ్రీనివాసరావును అడిగారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను 2006-07 సంవత్సరంలో ప్రభుత్వం జిందాల్ యాజమాన్యంనకు 966 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేసిందని సమాధానం ఇచ్చారు. జిందాల్ అల్యూమినియం పరిశ్రమ స్థాపనకు తీసుకున్న ఈ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్కుల నిర్మాణానికి 2023లో అనుమతులు పొందినట్లు చెప్పారు. అనంతరం ఎండీ దీనేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగానే పరిశీలనకు వచ్చినట్లు వివరించారు.
నిర్వాసితులతోనూ చర్చలు
జిందాల్ భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్మాణం దిశగా చొరవ తీసుకుంటున్న ప్రభుత్వం నిర్వాసితులపైనా దృష్టి పెట్టింది. వారితో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం జిందాల్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు చేస్తోందన్న అనుమానం భూ నిర్వాసితులకు కలిగింది. దీంతో రెండు రోజుల కిందట విజయవాడ వచ్చిన జాతీయ ఎస్టీకమిషన్ చైర్మన్ అంతర్‌సింగ్ ఆర్యాకు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. జిందాల్ భూనిర్వాసితుల తరుపున పోరాటం చేస్తున్న ఎంఎల్‌సీ ఇందుకూరి రఘురాజుతో సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది.