Elephant Movements ఏనుగుల కదలికలపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:34 PM
Special Surveillance on Elephant Movements మక్కువ మండలంలో ఏనుగుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్‌వో) ప్రసూన తెలిపారు. వీరాడవలస, కేండ్రుకఘైశిల గ్రామాల్లో ఏనుగుల సంచరించే ప్రదేశాలను బుధవారం ఆమె పరిశీలించారు.
మక్కువ రూరల్, జూన్3(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలంలో ఏనుగుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్‌వో) ప్రసూన తెలిపారు. వీరాడవలస, కేండ్రుకఘైశిల గ్రామాల్లో ఏనుగుల సంచరించే ప్రదేశాలను బుధవారం ఆమె పరిశీలించారు. గత ఐదురోజులుగా వివిధ గ్రామాల్లో ఏనుగుల సంచారం వల్ల ప్రజలు, రైతులకు కలిగిన నష్టాలు, తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లా డుతూ.. గజరాజుల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 11 మంది ట్రాకర్స్‌తో పాటు అటవీశాఖ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పంటలు దెబ్బతిన్న రైతుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని వెల్లడించారు. ఏనుగులు సంచరిస్తున్న గ్రామాల్లో ప్రజలు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని సూచించారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆమె వెంట మక్కువ మండల సెక్షన్ ఫారెస్టు అధికారి సింహాద్రి, బీటు ఆఫీసర్లు, ట్రాకర్లు తదితరులు ఉన్నారు.
పాతఘైశిల పరిసరాల్లో గజరాజులు
నంద పంచాయతీ పరిధి పాతఘైశిల గ్రామంలో బుధవారం ఏనుగులు హల్‌చల్ చేశాయి. దీంతో స్థానికులు హడలిపోయారు. ఉదయం వీరాడవలస పామాయిల్ తోటల్లో సంచరించిన గజరాజులు సాయంత్రానికి తిరిగి మార్కొండపుట్టి పరిసరాలకు చేరుకున్నాయి. పాతఘైశిల, కేండ్రుకఘైశిల, వీరాడవలస, పరిసరాల్లో రోజంతా సంచరించిన ఏనుగులు మధ్యాహ్నం వీరాడవలస చిట్టగెడ్డ వద్ద కొంతసేపు సేదతీరాయి. మొత్తంగా ఎనిమిది గజరాజుల గుంపు మార్కొండపుట్టి, నంద, ఎస్.పెద్దవలస గ్రామాల పరిసరాల్లోనే తిరుగుతుండడంతో ఆయా ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖాధికారులు స్పందించి.. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.