'Special' rule in the villages! పల్లెల్లో ‘ప్రత్యేక’ పాలన!
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:19 PM
'Special' rule in the villages! పల్లెల్లో త్వరలో ప్రత్యేక పాలన మొదలుకానుంది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుండటంతో గ్రామ పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు (స్పెషల్ ఆఫీసర్లు) అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
పల్లెల్లో ‘ప్రత్యేక’ పాలన!
ఏప్రిల్ 2తో ముగియనున్న పంచాయతీల పదవీ కాలం
జిల్లాలోని 777 గ్రామాలకు ప్రత్యేకాధికారులు
జూన్ తర్వాత స్థానిక ఎన్నికలు
రిజర్వేషన్ల ఖరారుకు సమయం పట్టే అవకాశం
తొలుత పరిషత్.. ఆపై పంచాయతీ సమరం?
విజయనగరం, మార్చి 5(ఆంధ్రజ్యోతి):
పల్లెల్లో త్వరలో ప్రత్యేక పాలన మొదలుకానుంది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుండటంతో గ్రామ పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు (స్పెషల్ ఆఫీసర్లు) అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఎన్నికలు జరిగే వరకు మండల స్థాయి అధికారులకే గ్రామాల పగ్గాలు అప్పగించనున్నారు. బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషనర్ నివేదిక తదితర సాంకేతిక, న్యాయపరమైన అంశాల నేపథ్యంలో.. జూన్ తర్వాతే స్థానిక సమరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేకాధికారుల చేతుల్లోకి 777 పంచాయతీలు
జిల్లాలోని 27 మండలాల పరిధిలో మొత్తం 777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ నాటికి ప్రస్తుత సర్పంచుల ఐదేళ్ల పదవీకాలం ముగుస్తుంది. నిబంధనల ప్రకారం ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు. దీంతో జిల్లాలోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులను గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ఒక్కో అధికారికి రెండు నుంచి మూడు లేదా ఆపై పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఎన్నికల ఆలస్యానికి కారణాలివే...
ఎన్నికల నిర్వహణకు ముందు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు (ట్రిపుల్ టెస్ట్) ప్రకారం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి కనీసం మరో రెండు నెలలు పడుతుంది. వీటికి తోడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నీలంసాహ్ని పదవీకాలం నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త ఎస్‌ఈసీ రావాల్సి ఉంటుంది. ఈ పరిణామాలన్నీ పూర్తయ్యే సరికి జూన్ దాటే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముందు ఏ ఎన్నికలు..?
ఎన్నికల నిర్వహణపై కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముందుగా పార్టీ గుర్తులు లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. గ్రామాల్లో సహజంగానే వర్గాలు ఏర్పడతాయి. ఈ వర్గపోరు ప్రభావం ఆ తర్వాత జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని జిల్లా నేతలు భావిస్తున్నారు. అలాకాకుండా, ముందుగా పార్టీ గుర్తుల మీద జరిగే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే, కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి పూర్తిస్థాయిలో స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఉన్న మండల స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు సైతం ముందుగా పరిషత్ ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడమే శ్రేయస్కరమని జిల్లా కూటమి ముఖ్యనేతలు సైతం భావిస్తున్నట్లు సమాచారం.
రూ.269 కోట్లతో రోడ్ల అభివృద్ధి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ‘పల్లె పండుగ 2.0’ కింద జిల్లా వ్యాప్తంగా మొదటివిడతలో రూ. 109 కోట్ల భారీ నిధులతో పనులు చేపట్టారు. రెండో విడతలో రూ 160కోట్లు తో ఈ పనులను మరింత వేగవంతం చేసి, గ్రామాల రూపురేఖలు మార్చిన తర్వాతే ప్రజల వద్దకు వెళితే సానుకూల ఫలితాలు ఉంటాయని, ఈ అభివృద్ధి పనులే ఎన్నికల్లో కూటమికి శ్రీరామరక్షగా నిలుస్తాయని అధికార పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
------------