నేటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:42 PM
జిల్లా పరిధిలోని పంచాయతీల సర్పంచ్‌ల పదవీ కాలం గురువారంతో ముగిసింది.
- ముగిసిన సర్పంచ్‌ల పదవీ కాలం
- రేపు ప్రత్యేక సమావేశం నిర్వహణకు సన్నాహాలు
పార్వతీపురం/గరుగుబిల్లి, సాలూరు రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని పంచాయతీల సర్పంచ్‌ల పదవీ కాలం గురువారంతో ముగిసింది. ఈ మేరకు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి 451 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ఈ నెల 3న (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సెలవు కావడంతో 4వ తేదీన ప్రత్యేకాధికారులు కొలువుదీరనున్నారు. మండలాల వారీగా శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన తదుపరి పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలను స్వీకరించనున్నారు. జిల్లాలో 76 మంది ఎంపీడీవోలు, 54 మంది తహసీల్దార్లు, 40 మంది ఎంఈవో-1లు, 34 మంది ఎంఈవో-2లు, 48 మంది మండల వ్యవసాయాధికారులు, 25మంది ఐసీడీఎస్ అధికారులు, 30 మంది ఉప తహసీల్దార్లు, ఉద్యానశాఖకు సంబంధించి ఐదుగురు, పౌర సరఫరాలశాఖ ఉప తహసీల్దార్లు 9 మంది, డిప్యూటీ ఎంపీడీవోలు 61 మంది, గ్రామ, వార్డు సచివాలయాల డిప్యూటీ ఎంపీడీవోలు 42 మంది, గృహ నిర్మాణశాఖకు సంబంధించి ముగ్గురు, ఏటీడబ్ల్యూవోలు ఇద్దరు, మండల పరిషత్ కార్యాలయ ఏవోలు 22 మంది ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు సంబంధిత ఎంపీడీవోలకు ప్రత్యేకాధికారుల నియామకాల సమాచారాన్ని అందించారు. 2021 మార్చిలో సర్పంచ్‌లకు ఎన్నికలు జరిగాయి. తొలుత పంచాయతీ ఎన్నికలు 2020లో నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. ఈ ఎన్నికలను 2021లో నిర్వహించారు. జిల్లాలో 451 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీల్లో సర్పంచులు పాలన సాగించారు. ఇప్పుడు పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారులను నియమించారు. పంచాయతీలకు మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది.
కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరిగాయి. తొలి మూడేళ్లు వైసీపీ ప్రభుత్వంలో నిధులు రాక తిప్పలు పడ్డాం. ఏ పని జరిగినా ఆయా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, పంచాయతీ నిధులను దారి మళ్లీంచడం తదితర చర్యలతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పంచాయతీల్లో సీసీ రోడ్లు, కాలువలు, బీటీ రోడ్లు తదితర పనులను వేగవంతంగా నిర్వహించాం. పదవి నుంచి దిగిపోయే ముందు కొన్ని అభివృద్ధి పనులు చేశామనే తృప్తి మిగిలింది.
-ఆముదాల నళిని, మాజీ సర్పంచ్, కూర్మరాజుపేట, సాలూరు