Mandal Parishads మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులు
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:07 AM
Special Officers Appointed for Mandal Parishads ఉమ్మడి జిల్లా పరిధిలోని మండల ప్రజా పరిషత్ పాలకవర్గ కాల పరిమితి ఈ నెల 23తో ముగియనుంది. 24 నుంచి మండలాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు.
రేపటితో ముగియనున్న పాలకవర్గం పదవీకాలం
పారితోషికం చెల్లించాలని ఎంపీటీసీ సభ్యుల విన్నపం
గరుగుబిల్లి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పరిధిలోని మండల ప్రజా పరిషత్ పాలకవర్గ కాల పరిమితి ఈ నెల 23తో ముగియనుంది. 24 నుంచి మండలాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మండల ప్రాదేశిక ఎన్నికలు 2021, సెప్టెంబరు 24న జరిగాయి. ఐదేళ్ల కాల పరిమితి ఈ నెల 23తో ముగియనుంది. అప్పట్లో 549 ప్రాదేశికాలకు గాను 62 ఏకగ్రీవ మయ్యాయి. 497 ప్రాదేశికాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవీ కాలంలో 19 వరకు సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే మన్యం జిల్లాకు సంబంధించి 451 పంచాయ తీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. కాగా మండల పరిషత్‌లకు జిల్లాస్థాయి అధికారులను కలెక్టర్ నియమించనున్నారు. ఈ ప్రత్యేకాధికారులు ఈ నెల 24 నుంచి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇదిలాఉండగా ఎంపీఈసీలకు గతేడాది జూన్ నుంచి సుమారు 15 నెలలుగా పారితోషికం విడుదల కావడంలేదు. ఎంపీటీసీలకు నెలకు రూ. 3 వేలు, ఎంపీపీలకు నెలకు రూ. 6 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. 60 నెలలకు సంబంధించి 45 నెలల వరకు పారితోషికం అందించారు. పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు చొరవ చూపి 15 నెలలకు సంబంధించిన పారితోషికం విడుదల చేయాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు కోరుతు న్నారు. దీనిపై ఎంపీడీవో ఎన్.సూర్యనారాయణను వివరణ కోరగా.. ‘ఈ సమస్యను ఉన్నతాధి కారులకు నివేదించాం. పారితోషికం చెల్లింపుల కోసం ట్రెజరీలకు బిల్లులు పంపించాం.’ అని తెలిపారు.