Special holidays for police పోలీసులకు ప్రత్యేక సెలవులు
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:50 AM
Special holidays for police జిల్లాలో పోలీస్ అధికారులు, సిబ్బందికి గుడ్ న్యూస్. వారి పుట్టిన రోజుతో పాటు పెళ్లి రోజునాడు కచ్చితంగా సెలవులు ఇవ్వాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్వర్వులు జారీచేశారు.
పోలీసులకు ప్రత్యేక సెలవులు
పుట్టిన రోజు, పెళ్లిరోజున తప్పకుండా ఇవ్వాల్సిందే
డీజీపీ ఉత్తర్వులు జారీ
జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం
రాజాం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పోలీస్ అధికారులు, సిబ్బందికి గుడ్ న్యూస్. వారి పుట్టిన రోజుతో పాటు పెళ్లి రోజునాడు కచ్చితంగా సెలవులు ఇవ్వాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్వర్వులు జారీచేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించి.. ఆ రెండు దినాల్లో వారికి ప్రత్యేక సెలవులు ఇవ్వాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. దీనిపై పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పోలీస్ శాఖలో సెలవులు అంటేనే గగనం. శాంతిభద్రతల కారణాలు, సిబ్బంది కొరత దృష్ట్యా సెలవులు ఆశించిన స్థాయిలో దొరకవు. అత్యవసర సమయాల్లో సైతం వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే సెలవులు కంటే వారితో షిఫ్టుల వారీగా పనులు చేయించుకుంటున్నారు. వీక్లీ ఆఫ్‌లు కూడా పేపరుకే పరిమితం అయ్యాయి తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఇటువంటి సమయంలో పుట్టిన రోజుతో పాటు పెళ్లిరోజునాడు ప్రత్యేక సెలవులుగా ఇవ్వాలని నిర్ణయించడం శుభ పరిణామం. ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకూ ప్రతిఒక్కరికీ వర్తింపజేశారు. జిల్లాలో 44 పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న దాదాపు 1500 మందికి ఇది శుభవార్త.
ఠంఛనుగా జీతాలు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్ శాఖలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చింది. ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు సెలవు అయితే ముందు రోజు జీతాలు అందిస్తోంది. మరోవైపు పోలీస్ సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేస్తోంది. రుణాలతో పాటు ఇతర వసతుల కోసం దరఖాస్తు చేసుకున్న మరుక్షణం అందిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అలా కాదు. జీతాలు సకాలంలో పడేవి కావు. గృహ అవసరాల నిమిత్తం రుణ దరఖాస్తులను సైతం పెండింగ్‌లో పెట్టేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ చేసింది.
స్టైఫండ్ పెంపు
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోస్టులను భర్తీ చేసింది. మన జిల్లాకు సంబంధించి 300 పైగా పోస్టులను భర్తీచేసింది. ప్రస్తుతం వారు శిక్షణలో ఉన్నారు. వారిని భర్తీచేస్తే స్టేషన్లలో సిబ్బంది కొరత తీరనుంది. మరోవైపు కానిస్టేబుళ్లకు ట్రైనింగ్‌లో ఇచ్చే స్టైఫండ్‌ను సైతం అమాంతం పెంచింది. రూ.4,500 ఉన్న స్టైఫండ్‌ను రూ.12,500కు పెంచింది. ఇలా పోలీస్ శాఖ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. దీనిపై పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శుభ పరిణామం
పోలీస్ శాఖలో సెలవులు అనేవి ఉండవు. అటువంటిది కూటమి ప్రభుత్వం పెళ్లిరోజుతో పాటు పుట్టిన రోజు నాడు ప్రత్యేక సెలవును మంజూరు చేయడం ఆనందంగా ఉంది. వీక్లీఆఫ్‌లతో పాటు సాధారణ సెలవులు కూడా వినియోగించుకోలేం. ఆ రెండు రోజులు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాల్సిందేనని డీజీపీ ఉత్తర్వులు జారీచేయడం శుభ పరిణామం.
- ఉపేంద్ర, రాజాం రూరల్ సీఐ
మంచి నిర్ణయం
ఏ ఉద్యోగికైనా సెలవు అనేది సర్వసాధారణం. కానీ పోలీస్ శాఖలో అలా కాదు. నిరంతరం శాంతిభద్రతల పర్యవేక్షణే ప్రధాన విధి. నిత్యం పని ఒత్తిడితో గడపాల్సిందే. కుటుంబాలకు సరైన సమయం కూడా ఇవ్వలేం. అటువంటిది పుట్టిన రోజు, పెళ్లి రోజు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేయాలని డీజీపీ ఆదేశాలివ్వడంపై మంచి నిర్ణయం
- కె.అశోక్‌కుమార్, రాజాం సీఐ