సంక్షేమం, అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:09 AM
రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పథకాల అమలు
- మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
సీతంపేట, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డితో కలిసి సీతంపేట ఏజెన్సీలో ఆయన పర్యటించారు. సీతంపేటలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్న మంత్రికి వెలుగుశాఖ ఆధ్వర్యంలో మహిళలు పూర్ణకుంభం, నృత్యాలతో స్వాగతం పలికారు. మహిళలతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే థింసా నృత్యం చేశారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండచీపుర్ల తయారీ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కోసం ఏడాదికి రూ.33వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ‘పింఛన్‌ల కోసం నెలకు రూ.2700కోట్లు ఖర్చు చేస్తున్నాం. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటిని అధిగమించి సంక్షేమ, అభివృద్థి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సీతంపేటలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎఫ్‌పీవో(రైతు ఉత్పత్తి సంస్థ)ల బలోపేతానికి ప్రభుత్వం రూ.75లక్షలు కేటాయించింది. ఈ ప్రాంతంలో రైతులు పండించే పంటలను ఎఫ్‌పీవోల ద్వారా కొనుగోలు చేస్తాం. వచ్చిన ఆదాయాన్ని ఎఫ్‌పీవో సభ్యులకు అందిస్తాం. ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఏర్పాటైన కొండచీపుర్ల తయారీ యూనిట్‌ను రెండేళ్లపాటు సక్రమంగా నిర్వహిస్తే బ్యాంక్‌లు ముందుకు వచ్చి రుణాలు ఇస్తాయి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పం.’ అని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, పాలకొండ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి, వెలుగు డీపీఎం రమణ, ఏపీఎం కమలకుమారి, కూటమి నాయకులు గర్భాణ సత్తిబాబు, పవన్, హెచ్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.