Tribal Girl Students గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:56 PM
Special Focus on the Health of Tribal Girl Students గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో వైశాలి ఆదేశించారు. బుధవారం భద్రగిరిలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.
గుమ్మలక్ష్మీపురం, జూలై15(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో వైశాలి ఆదేశించారు. బుధవారం భద్రగిరిలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడి.. విద్యార్థినులకు అందుతున్న సేవలు, విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థినుల విద్యా ప్రగతిని స్వయంగా అడిగి తెలుసు కున్నారు. అనంతరం బాలికల హాజరుపట్టిక, ఉపాధ్యాయులు లాగ్‌బుక్స్, పాఠశాల రికార్డులు, స్టోర్‌రూం, వంటగది, నిత్యావసర సరుకుల నిల్వలు, కాయగూరల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన పోషకాలతో ఆరం అందించాలని వార్డెన్‌ను ఆమె ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో అలసత్వం పనికిరాదన్నారు. పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థినుల ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడి నుంచి ఆమె నేరుగా ఎల్విన్‌పేట చేరుకుని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుతున్నది లేనిదీ పరిశీలించారు. ఆ తర్వాత గుమ్మలక్ష్మీపురం జీసీసీ డీఆర్ డిపోనూ పరిశీలించారు. రేషన్ సరుకులు ఎలా అందిస్తున్నారు? తూకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీశారు. చివరగా పుట్టజమ్మ గ్రామంలో జరుగుతున్న వాటర్‌షెడ్ పనులు, ఫాంపాండ్స్‌ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.