Share News

Students' Health విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:46 PM

Special Focus on Students' Health జిల్లాలో అన్ని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.

 Students' Health విద్యార్థుల ఆరోగ్యంపై  ప్రత్యేక శ్రద్ధ

పార్వతీపురం, జూలై8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల హాజరు, ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహర నాణ్యత, భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతినెలా ప్రగతి నివేదికలను అందించాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తాగునీరు, మరుగుదొడ్లు, ఆర్‌వో ప్లాంట్లు, దోమతెరలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈఫైల్‌ నిర్వహణతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. మూడు నెలల్లోగా బ్యాటరీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. యోగా, క్రీడలు, ఎన్‌సీసీ, స్కాట్స్‌లో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్య పురోగతిపై తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి జేసీ వైశాలి, సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయశాంతి, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు పాల్గొన్నారు.

పీఎంశ్రీ పాఠశాలలను అభివృద్ధి చేయాలి

జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ఆదర్శ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఆదేశించారు. మౌలిక వసతులు, డిజిటల్‌ తరగతులు, ల్యాబ్‌, గ్రంథాలయాలు, క్రీడా సౌకర్యాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పీఎం పోషణ్‌ పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పోషకాహారం అంచాలని అధికారులను ఆదేశించారు. పాటు తాగునీరు, న్యూట్రీగార్డెన్ల ఏర్పాటుపై ప్రత్యక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సమీక్షలో డీఈవో పి. బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష సిబ్బంది, వివిధ పాఠశాలల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 11:46 PM