Education and Infrastructure విద్యా, వసతిపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:29 PM
Special Focus on Education and Infrastructure గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాల్లో విద్యా, వసతిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవో, ప్రిన్సిపాల్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై అప్రమత్తం
సీతంపేట,ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాల్లో విద్యా, వసతిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవో, ప్రిన్సిపాల్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేయిస్తోంది. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాలు, మెనూ, పారిశుధ్యం, తాగునీరు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా పాఠశాలల పనితీరును మరింత సమర్థవంతంగా అంచనా వేస్తారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ప్రాముఖ్యతపై పిల్లల తల్లిదండ్రులకు పూర్తిగా అవగాహన కల్పించాలి. కాల్స్‌కు తప్పనిసరిగా స్పందించేలా చర్యలు తీసుకోవాలి. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షిత నీరు, పోషకాహారం, మరుగుదొడ్లు, విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలి. గిరిజన విద్యా ర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో హెచ్‌ఎం, వార్డెన్‌లు కీలకపాత్ర పోషించాలి. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీడీ అన్నాదొర, పీహెచ్‌వో గణేష్, జీసీడీవో రాములమ్మ, సీఎంవో చిరంజీవులు పాల్గొన్నారు.
ఇకపై సోమవారమే పీజీఆర్‌ఎస్
సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఇకపై సోమవారం మాత్రమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు తాను అందుబాటులో ఉంటానన్నారు. ఈవిషయాన్ని గిరిజనులు గమనించాలని సూచించారు. మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇకపై శుక్రవారం పీజీఆర్‌ఎస్ ఉండదని స్పష్టం చేశారు.
9న పలాసలో..11న సీతంపేటలో ..
పలాస వేదికగా ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ వేదికగా ఈనెల 11న గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు, పలు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల గొప్ప వారసత్వాన్ని, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయడం తో పాటు వారి ఐక్యతను చాటిచెప్పే విధంగా వేడుకలను నిర్వహిస్తామన్నారు. గిరిజన సంఘాల నాయకులు , ప్రజా ప్రతినిధులు, గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.