నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:31 PM
Special Care for Newborn Babies' Health నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ, పోషణపై ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి సూచించారు. జాతీయ నవజాత శిశువుల వారోత్సవాల సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో పోస్టర్లను ఆవిష్కరించారు.
పార్వతీపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ, పోషణపై ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి సూచించారు. జాతీయ నవజాత శిశువుల వారోత్సవాల సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన నుంచి ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు అందించాలన్నారు. సకాలంలో టీకాలు వేయించాలని సూచించారు. తక్కువ బరువుతో లేదా నెలల నిండకముందే జన్మించిన శిశువులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శిశు మరణాల నివారణకు కృషి చేయాలని, దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, డీఐవో విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై శిక్షణ
ధాన్యం కొనుగోలు ప్రక్రియ రైతులకు అనుకూలంగా ఉండాలని, వారిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగొలుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రైతులు పేర్లు నమోదు, ధాన్యం విక్రయించనున్న వారి వివరాలు నమోదు , రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సమాచారం అందించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.