Share News

speady work చకచకా

ABN , Publish Date - May 14 , 2026 | 12:04 AM

speady work ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కానున్న భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. కొద్ది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

speady work చకచకా
భోగాపురం విమానాశ్రయం

చకచకా

చివరి దశకు చేరుకొన్న భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు

జూలైలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కానున్న భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. కొద్ది పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలైలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 81వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్‌ భవనం, 3.8 కిలోమీటర్ల పొడవున రన్‌వేలు, ట్యాక్సీవే, ఏటీసీ, ఇతర భవనాల నిర్మాణం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి.

భోగాపురం, మే13(ఆంధ్రజ్యోతి):

గత టీడీపీ ప్రభుత్వంలో 2708 ఎకరాల భూసేకరణ అనంతరం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారాచంద్రబాబునాయుడు 2019 ఫిబ్రవరి 14న భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు చేపట్టకుండా కాలయాపన చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా 2023 మే3న శంకుస్థాపన చేశారు. పనులు తూతూమంత్రంగా చేపడుతూ గత ప్రభుత్వంలో 26శాతం మాత్రమే చేయగలిగారు. కాగా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక విమానాశ్రయం కీలక మలుపు తిరిగింది. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 2026 జూలై నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. ఇదే సమయంలో పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కూడా ఎప్పటికప్పుడు విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలిస్తూ సమీక్షిస్తూ వచ్చారు. పనులు చివరి దశకు చేరుకొన్నాయి. జూలైలో ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతం అయింది.

ఫ ఏడాదిలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే విధంగా ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టారు. తాగునీరు, విద్యుత్‌ పనులు పూర్తి అయ్యాయి. ఉత్తరాంధ్ర సాంస్కృతి ప్రతిబింబించేలా రూపురేఖలు ఉన్నాయి. జాతీయరహదారి-16ని ఎయిర్‌పోర్టు రహదారితో కలిపే విధంగా అమటాంరాయవలస సమీపంలో చేపట్టిన ట్రంపెట్‌ నిర్మాణం దాదాపు పూర్తికావొస్తోంది. అలాగే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు రావాలంటే సుమారు 55 కిలోమీటర్లకు పైగా దూరం ఉండడంతో తక్కువ సమయంలో వచ్చేందుకు అప్రోచ్‌ రహదారులను సిద్ధం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది నివాస గృహాలు సైతం కొలిక్కి వచ్చాయి. రామచంద్రపేట సమీపంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. నందిగాం సమీప చంపావతి నది నుంచి ఎయిర్‌పోర్టుకు అవసరమైన తాగునీరు సరఫరా కానుంది.

ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి పనులు

విశాఖ జిల్లా భీమిలి నుంచి భోగాపురం వరకు ఆరు రహదారుల బీచ్‌కారిడర్‌ నిర్మాణం జరగనుంది. ఎయిర్‌పోర్టు సమీపంలో విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పరిధిలో ఒబెరాయ్‌ హోటల్‌తో పాటు మరికొన్ని స్టార్‌ హోటళ్ల నిర్మాణం జరుగనుంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ రానున్నాయి. ఏవియేషన్‌ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎలక్ట్రికల్‌ బస్సులు నడిపేలా ఎయిర్‌పోర్టు నిర్వాహకులు ఆర్‌టీసీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు.

ప్రత్యేకతలు

దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8 కిలోమీటర్ల మేర రన్‌వే ఈ ఎయిర్‌పోర్టు ప్రత్యేకత. ఇప్పటికే అత్యాధునిక ఎయిర్‌పోర్టులుగా ముంబయి, ఢిల్లీ సమీపంలోని నొయిడా ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సైతం వాటి సరసన చేరనుంది. మత్స్య ఆకారంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయంలో ఇంటీరియర్‌ డిజైన్‌ చేశారు. ఎయిర్‌పోర్టుకు దగ్గరగా 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వులో పెట్టింది. అక్కడ పర్యాటక, ఇతరత్రా నిర్మాణాలు చేపట్టనున్నారు.

Updated Date - May 14 , 2026 | 12:05 AM