Someone from our own family! ఎవరైనా మా కుటుంబం నుంచే!
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:33 AM
Someone from our own family!
ఎవరైనా మా కుటుంబం నుంచే!
మహిళా రిజర్వేషన్ పెరిగినా పైచేయికి వ్యూహం
కుమార్తెలు, కోడళ్లు, తల్లులను దించాలని తహతహ
కార్పొరేషన్లో పోటాపోటీ
విజయనగరం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల వేడి జోరందుకుంటోంది. ఈసారి మేయర్, మునిసిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో నేతలు ఎవరికివారే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. అయితే రిజర్వేషన్లలో భాగంగా జిల్లాలో మహిళలకు అధిక సీట్లు కేటాయించడంతో కాస్త నీరుగారి మళ్లీ కొత్త వ్యూహంతో పైకి లేచారు. తమకు బదులు కుటుంబంలోని మహిళలను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించి 62 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఏకంగా 31 డివిజన్లను మహిళలకు కేటాయించడంతో నేతలు తమ కుటుంబంలోని తల్లులు, భార్యలు, కుమార్తెలు, కోడళ్లను రంగంలోకి దించాలని చూస్తున్నారు. మేయర్ పదవి అంటే దాదాపు ఎమ్మెల్యేతో సమానం. ఈ పదవి కోసం ఆశావహులు అధికంగానే ఉన్నారు. కూటమి నుంచి ప్రధానంగా ప్రసాదుల కనకమహాలక్ష్మి, కంది మురళీనాయుడు, కర్రోతు నరసింగరావు, గంటా రవి, అవనాపు విజయ్‌లు టిక్కెట్ కోసం గట్టిగా పోటీపడుతున్నారు. ప్రసాదుల కనకమహాలక్ష్మీ గతంలో చైర్‌పర్సన్‌గా, ఆమె భర్త రామకృష్ణ ఒకసారి మునిసిపల్ చైర్మన్‌గా వ్యవహరించారు. వివాద రహితులు అన్న పేరు ఉంది. కంది మురళీనాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఆయన భార్య శమంతమణి రేసులో ఉన్నారు. గతంలో మేయర్ రేసులో నిలబడ్డారు. మరోవైపు అవనాపు విజయ్ తన భార్య భార్గవికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగరావు భార్య రాధామణి కూడా రేసులో ఉన్నారు. ఆమె మాజీ కార్పొరేటర్ కూడా. అయితే విజయనగరం కార్పొరేషన్లో కేంద్ర మాజీ మంత్రి, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు, ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సిఫారసులకే హైకమాండ్ పెద్దపీట వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. గురువారం సాయాంత్రం వరకు టీడీపీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
- విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ పదవి రేసులో చిన్నశ్రీను కుమార్తె సిరసహస్ర పేరు తెరపైకి వచ్చింది. ఈమెకు అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం వ్యాపించింది. చిన్నశ్రీను టీడీపీలోని కొంతమంది పెద్ద నాయకులతో టచ్‌లో ఉన్నారని, ఖచ్చితంగా అమె పేరును మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
- వైసీపీకి సంబంధించి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి పోటీచేసే అవకాశం ఉంది. ఆమె గతంలో డిప్యూటీ మేయర్‌గా కూడా వ్యవహరించారు. చిన్నశ్రీను పార్టీకి గుడ్ బై చెప్పడంతో విజయనగరం జిల్లా కేంద్రంలో బొత్స కుటుంబ హవా తగ్గింది. దీంతో కోలగట్ల మాత్రమే వైసీపీకి ఏకైక దిక్కు.
-----------------------