కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - May 21 , 2026 | 10:33 PM
జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల సంస్థ గోదాంలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- అధికారులను ఆదేశించిన కలెక్టర్
పార్వతీపురం, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల సంస్థ గోదాంలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఈవీఎం గోదాములను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న కార్మికులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి వారి సాదబాధకాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో తమకు ప్రతి నెలా పదో తేదీలోగా జీతాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, దీంతో కుటుంబ నిర్వహణ ఇబ్బందిగా మారుతుందని కార్మికులు కలెక్టర్‌కు వివరించారు. తమకు ఎలాంటి బీమా సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అక్కడికక్కడే అధికారులు రప్పించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి జీతాల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై వివరణ కోరారు. సాంకేతిక కారణాలతో ఈ నెల ఆలస్యమైందని డీఎం వివరించగా.. వాటిని అధిగమించి ఇకపై ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్మికులకు ప్రభుత్వం అందించే బీమా, ఇతర సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన అవసరమని తెలిపారు. వారికి లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో తాగునీటి ఎద్డడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జల్‌జీవన్ మిషన్ కింద మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగునీటి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు రానున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి, వారిని ఒప్పించి ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. చెరువు గర్భాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు.