Share News

ఇళ్లల్లో సోలార్‌ వెలుగులు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:39 PM

మారుమూల గ్రామాల్లోని ఇళ్లల్లో ఇక నుంచి సోలార్‌ కాంతులు విరజిల్లనున్నాయి.

   ఇళ్లల్లో సోలార్‌ వెలుగులు
వీరఘట్టంలో సోలార్‌ సెట్‌లు

- ఎస్సీ, ఎస్టీలగృహాలపై పలకలు అమరిక

- ప్యానళ్లను ఉచితంగా అందిస్తున్న కేంద్రం

వీరఘట్టం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాల్లోని ఇళ్లల్లో ఇక నుంచి సోలార్‌ కాంతులు విరజిల్లనున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన గృహాలకు విద్యుత్‌ అంతరాయం లేకుండా సోలార్‌ పలకలను అమర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ గృహాలకు అవసరమైన సోలార్‌ పరికరాలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. పాలకొండ డివిజన్‌లోని వీరఘట్టం, సీతంపేట, పాలకొండ, భామిని, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లపై రూ.2.80 లక్షల విలువ గల రెండు కిలో వాట్ల సామర్థ్యం ఉన్న సోలార్‌ సెట్‌లను అమర్చనున్నారు. వీరఘట్టం కేంద్రంగా సద్బవ్‌ ఫ్యూచర్‌ టెక్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే పరికరాలు చేరాయి. వీరఘట్టంలో మండలంలో 3,905 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. మొదటి విడతగా 1,043 ఇళ్లపై సోలార్‌ పరికరాలను అమర్చనున్నారు. అదే విధంగా ఏడు మండలాల్లో అర్హులైన 7,308 ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లపై వీటిని అమర్చేందుకు కావాల్సిన సోలార్‌ పరికరాలు కూడా చేరుకున్నాయి. దీంతో పాటు ప్రతి ఇంటికీ నెలకు రూ.400 అద్దె కూడా ప్రభుత్వం చెల్లించనుంది.

Updated Date - Mar 26 , 2026 | 11:39 PM