Share News

వసతి గృహాల్లో సోలార్‌ కాంతులు

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:30 PM

జిల్లాలోని వసతి గృహాలు, పాఠశాలల్లో సోలార్‌ కాంతులు విరజిల్లనున్నాయి.

 వసతి గృహాల్లో  సోలార్‌ కాంతులు
పాలకొండలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల

- ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రణాళిక

- విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు

- రెండు విడతల్లో చేపట్టనున్న పనులు

పాలకొండ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వసతి గృహాలు, పాఠశాలల్లో సోలార్‌ కాంతులు విరజిల్లనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో సోలార్‌ ప్యానెళ్లను అమర్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వీటిద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. తద్వారా విద్యార్థులకు కరెంట్‌ కష్టాలు తప్పడంతో మిగులు విద్యుత్‌ను అమ్మడం వల్ల వసతి గృహాలు, పాఠశాలలకు ఆదాయం సమకూరనుంది. జిల్లా వ్యాప్తంగా 13 ఎస్సీ, 15 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. అదే విధంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 47 ఆశ్రమ పాఠశాలలు, 12 వసతి గృహాలు, 8 పోస్టు మె ట్రిక్‌ గిరిజన వసతిగృహాలు, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 47 ఆశ్రమ పాఠశాలలు, 8 పోస్టుమెట్రిక్‌ గిరిజన వసతి గృహాలు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు వంద మంది నుంచి 500 మంది విద్యార్థులు ఉన్నారు. వంద మంది ఉండే విద్యార్థులు ఉండే వసతి గృహాలకు ప్రతినెలా రూ.5 వేల వరకు విద్యుత్‌ బిల్లు వస్తుంది. అత్యధికంగా గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నెలకు రూ.6 వేలు విద్యుత్‌ బిల్లు వస్తుంది. జిల్లాలోని అన్ని వసతిగృహాలకు కలిపి నెలకు రూ.8 లక్షలకు పైగా విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హాస్టళ్లు, పాఠశాలల్లో సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటివల్ల విద్యుత్‌ బిల్లుల భారాన్ని వదిలించుకోవడంతో పాటు అదనంగా వచ్చే విద్యుత్‌ను అమ్మడం ద్వారా ఆయా పాఠశాలలు, వసతి గృహాలకు ఆదాయం సమకూర్చాలని భావిస్తోంది. ఒక్కో పాఠశాలలో 3.25కిలోవాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:30 PM