Share News

Soil.. looted మట్టి.. కొల్లగొట్టి

ABN , Publish Date - May 04 , 2026 | 12:02 AM

Soil.. looted చెరువుల్లో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా నచ్చినచోటల్లా తవ్వకాలకు దిగుతున్నారు. అక్రమార్కులకు రాజకీయ నేతల పలుకుబడి ఉండడంతో అధికారులు అటువైపుగా చూడడం లేదన్న విమర్శలున్నాయి.

Soil.. looted మట్టి.. కొల్లగొట్టి
రాజాం పట్టణానికి కూతవేటు దూరంలో ఓ చెరువులో మట్టి తవ్వకాలు

మట్టి.. కొల్లగొట్టి

రాజాం సమీప చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

బరితెగిస్తున్న మాఫియా

చోద్యం చూస్తున్న యంత్రాంగం

రాజాం, మే3(ఆంధ్రజ్యోతి):

చెరువుల్లో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా నచ్చినచోటల్లా తవ్వకాలకు దిగుతున్నారు. అక్రమార్కులకు రాజకీయ నేతల పలుకుబడి ఉండడంతో అధికారులు అటువైపుగా చూడడం లేదన్న విమర్శలున్నాయి. రాజాం నియోజక వర్గంలో మట్టి తవ్వకాలు అత్యధికంగా సాగుతున్నాయి. ఎక్కడా అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు. గ్రామాల్లో చోటా నాయకులు, ట్రాక్టర్‌ యజమానులు సిండికేటుగా మారి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాజాం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో గృహ నిర్మాణంతో పాటు ఇతరత్రా పనులు జరుగుతుండడంతో మట్టికి గిరాకీ ఏర్పడింది. ఒక ట్రాక్టరు లోడు రూ.1000 పైమాటే. రోజుకు పదుల సంఖ్యలో వాహనాల్లో తరలిస్తున్నారు. ఏకంగా యంత్రాలు పెట్టి తవ్వేస్తున్నారు. ఏ చెరువు చూసినా గోతులమయంగా మారిపోయింది. అడుగుల మేర లోతులో మట్టిని తీసి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

అక్రమార్కుల ఇష్టారాజ్యం

ప్రధానంగా రాజాం మండలం కొత్తవలస, కొత్తకంచరాం, ఎంజేవలసలో చెరువులు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. తమకు నచ్చిన విధంగా మట్టిని తవ్వుకుపోతున్నారు. ఇప్పటికే చెరువుల మదుములు, చప్టాలు పాడయ్యాయి. మట్టి తవ్వకాలతో అవి పూడుకుపోతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు మట్టిలోడ్లతో రాకపోకలు సాగిస్తుండడంతో గట్లు సైతం పాడవుతున్నాయి. పూర్తిగా నాశనమవుతున్నాయి. రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అటు సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లో సైతం మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీరు చేరలేదు. ఇదే అదునుగా స్థానిక నాయకులు ఎక్కడికక్కడే రెచ్చిపోతున్నారు. అన్ని పార్టీల నేతలు కలిసిపోతున్నారు. రాత్రిపగలూ తేడా లేకుండా యంత్రాలతో చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. వందలాది ట్రాక్టర్లు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజకీయ అండదండలుండడంతో అధికారులు అటువైపుగా చూడడం మానేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి పేరిట తవ్వకాలు చేపడుతున్నారు. లోడుకు రూ.50, రూ.100 రేటు కట్టి తరలిస్తున్నారు. ఇందులో చోటా నాయకులు, ట్రాక్టర్‌ యజమానులదే కీలక పాత్ర. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

చర్యలు తీసుకుంటాం

మట్టి తరలింపు నేరం. ఒకవేళ మట్టి తరలించాలంటే తప్పకుండా అనుమతులు తీసుకోవాలి. దీనిపై దృష్టిపెడతాం. అన్ని గ్రామాల రెవెన్యూ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. ఎక్కడైనా మట్టి తవ్వకాలు చేపడితే వెంటనే ఫిర్యాదు చేయాలి.

- ఎం.రాజశేఖర్‌, తహసీల్దారు, రాజాం

ధ్వంసం చేస్తున్నారు

కళ్లెదుటే చెరువులను ధ్వంసం చేస్తున్నారు. యంత్రాలతో మట్టి తీసి ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నారు. కనీసం గ్రామంలో ఉండే సచివాలయ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులకు చెబితే మా పని కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

- మొయిల నర్శింహులు, రైతు,

ఉన్నతాధికారులు పట్టించుకోవాలి

గ్రామాల్లో మట్టి మాఫియా పెట్రేగిపోతోంది. నాయకులు, ట్రాక్లర్ల యజమానులు కుమ్మక్కై మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాజాం పట్టణంలో గృహనిర్మాణాలకు మట్టి అవసరం ఎక్కువగా ఉండడంతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి.

- గుడివాడ శ్రీనివాసరావు, రైతు

Updated Date - May 04 , 2026 | 12:02 AM