సోడియం లెవల్స్ పడిపోతున్నాయ్!
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:40 PM
ప్రస్తుతం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు శరీరంలోని నీటితో పాటు లవణాలు ఆవిరైపోతున్నాయి.
- పెరుగుతున్న ఎండలు.. వృద్ధుల్లో డీ హైడ్రేషన్ సమస్యలు
- అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు
- హెచ్చరిస్తున్న వైద్యులు
- విజయనగరానికి చెందిన రామారావు (72) హఠాత్తుగా సోడియం లెవెల్స్ పడిపోవడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి ఐవీ ఫ్లూయిడ్స్ అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
- ఎండ వేడిమి వల్ల నీరసం తగ్గేందుకు రోజుకు ఐదు లీటర్ల సాధారణ నీరు తాగిన సీతమ్మ (68) హఠాత్తుగా డీ హైడ్రేషన్‌కు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయనగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. సీతమ్మ అతిగా నీరు తాగడంతో లవణాలు లోపించి డైల్యూషనల్ హైపోనట్రీమియా బారిన పడిందని వైద్యులు తెలిపారు.
విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు శరీరంలోని నీటితో పాటు లవణాలు ఆవిరైపోతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో సోడియం స్థాయి హఠాత్తుగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనినే హైపోనట్రీమీయా అంటారని వైద్యులు చెబుతున్నారు. ఎండ వేడికి డీహైడ్రేషన్ బారిన పడడంతో మెదడుపై ప్రభావం చూపి మరణానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో పలువురు వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురై ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
లక్షణాలు ఇవే
- సోడియం తగ్గడం అనేది ఒకేసారి తెలియదు. క్రమంగా లక్షణాలు కనిపిస్తాయి. ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసటగా అనిపిస్తుంటుంది.
- డీహైడ్రేషన్‌కు గురైన వ్యక్తి మనుషులను ఠక్కున గుర్తు పట్టలేడు. మతిమరుపు, అసంబద్ధంగా మాట్లాడడం, మాట తడబడటం వంటివి జరుగుతాయి
- చేతులు, కాళ్లల్లో నొప్పులు లేదా కండరాలు పట్టేయడం, ఆకలి మందగించడం, వికారంగా ఉండడం జరుగుతుంది. తీవ్రస్థాయిలో మూర్చ రావడం లేదా స్పృహ తప్పిపోవడం వంటివి జరుగుతాయి.
కారణాలు..
ఎండలతో చెమట పట్టి శరీరంలోని సోడియం బయటకు వెళ్లిపోతుంది. కొందరు దాహానికి కేవలం సాధారణ నీటిని లీటర కొద్దీ తాగుతారు. ఇది రక్తంలోని సోడియంను మరింత పలుచన చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలకు వాడే డైయూరెటిక్స్ వల్ల సోడియం తగ్గిపోతుంది. వయసు రీత్యా మూత్రపిండాలు పనితీరు తగ్గడం కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు.
నిర్ధారణ ఇలా
రక్తపరీక్ష ద్వారా సోడియం, పోటాషీయం స్థాయిలను తెలుసుకోవచ్చు. సాధారణంగా సోడియం స్థాయి 135-145 ఎంఈక్యూ/ఎల్ మధ్య వుండాలి. 130 కంటే తగ్గితే అది ప్రమాద సంకేతంగా భావించాలి. అలాగే మూత్ర పరీక్షలో ఎంత సోడియం బయటకు వెళ్తుందో తెలుస్తుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
కేవలం మంచినీళ్లు కాకుండా నీటిలో ఓఆర్‌ఎస్ పొడి లేదా చిటికెడు ఉప్పు పంచదార కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరినీరు, లేదా గ్లూకోజ్ కలిపిన నీటిని తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూసుకోవాలి. రోజులో రెండు గ్రాముల ఉప్పు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, మధుమేహం లేదా ఇతర మందులు వాడుత్నువారు ఎండల తీవ్రతను బట్టి మోతాదును మార్చాలా? అన్నది డాక్టరును అడిగి తెలుసుకోవాలి.
నిర్లక్ష ్యం చేస్తే ప్రాణానికే ముప్పు
వృద్ధుల్లో ప్రవర్తన హఠాత్తుగా మారినా, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నా, అది వడదెబ్బ కాదు. సోడియం తగ్గి ఉండవచ్చునని మనం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి. అశ్రద్ధ చేస్తే రోగి కోమాలోకి వెళ్లి మరణించే అవకాశం ఉంది. ఎండలు తగ్గే వరకూ వృద్ధులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ బయటకు రాకపోవడమే శ్రేయస్కరం. వడదెబ్బ తగిలినప్పుడు ఇచ్చే ఓఆర్‌ఎస్ ద్రావణం, సోడియం లోపాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వృద్ధుల్లో నీరసాన్ని వయసు రీత్యా వచ్చే సమస్యగా భావించకండి. అది సోడియం లోపం వల్లే వచ్చే ప్రాణగండం కావచ్చు.
-డాక్టర్ పీఎస్‌వీ రామారావు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, విజయనగరం