Social media... don't cross the line. సోషల్ మీడియా... గీత దాటొద్దయా..
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:18 AM
Social media... don't cross the line. సమాజంపై పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావాన్ని అనుకూలంగా మార్చుకునే వ్యక్తులు కూడా పెరుగుతున్న దశలో ప్రమాదకర పోకడలు చోటుచేసుకుంటున్నాయనడానికి రాజాంలో తాజాగా వెలుగుచూసిన ఘటన ఓ నిదర్శనం.
సోషల్ మీడియా... గీత దాటొద్దయా..
పెరిగిపోతున్న రీళ్ల సంస్కృతి
వినోదం అయితే సరే..
వికృతచేష్టలు చేస్తే జైలుకే..
సమాజంపై తీవ్ర ప్రభావం
సమాజంపై పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావాన్ని అనుకూలంగా మార్చుకునే వ్యక్తులు కూడా పెరుగుతున్న దశలో ప్రమాదకర పోకడలు చోటుచేసుకుంటున్నాయనడానికి రాజాంలో తాజాగా వెలుగుచూసిన ఘటన ఓ నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇమేజ్ పెంచుకోవడానికి ఓ యువకుడు పిల్లలను పావుగా వినియోగించాడు. పోలీసులకు సమాచారం అందడంతో కట్టడి చేశారు. కానీ ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇదే కాదు సోషల్ మీడియాకు అలవాటు పడిన పిల్లలు, యువత కూడా వక్రమార్గం పడుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.
రాజాం రూరల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
- రాజాం పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటకు చెందిన టొంపల అనిల్‌కుమార్ ఎనిమిది మంది మైనర్లతో కొన్నాళ్లుగా చట్టవిరుద్ధమైన వీడియోలు తీయించడం ప్రారంభించాడు. వాటిని తన ఇన్‌ష్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. తన ఇమేజ్ పెంచుకోవడం కోసం, లైక్‌ల కోసం మహిళలు, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేసేలా, ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉంటున్న ఇతని ఖాతాను రాజాం పోలీసులు గుర్తించారు. అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. వీడియోలు చిత్రీకరిస్తున్న ఆ ఎనిమిది మంది మైనర్లకు సీఐ నవీన్‌కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
- జూన్ 5న డోలపేటకు చెందిన ఓ మైనర్ కుర్రాడు సోషల్‌మీడియా ప్రభావంతో తన స్నేహితుడితో కలిసి తల్లిని పాశవికంగా హత్య చేశాడు. ముంబై వెళ్లి డాన్ కావాలన్న అతని కోరిక వెనుక యువతను చెడుమార్గం వైపు ప్రభావితం చేసే వీడియోలే కీలక పాత్ర పోషించాయని పోలీసుల వాదన.
సమాజంపై సోషల్‌మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఎక్కడెక్కడో ఉన్నవారిని దగ్గర చేస్తోంది. ట్విట్టర్‌లో ఒక పోస్టు పెడితే గంటల తేడాలో లక్షల మంది వీక్షిస్తున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ జాడ్యం నేడు పల్లెగడపకూ చేరింది. గతంలో యువత ఎక్కువగా ప్రభావితం కాగా నేడు వయసుతో సంబంధం ప్రతిఒక్కరూ రీళ్ల సంస్కృతికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అప్‌లోడ్ అవుతున్న వీడియోలలో హెచ్చుభాగం వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంచితే మరికొన్ని వీడియోలు మాత్రం యువత, మహిళలు, చిన్నారులపై చెడు ప్రభావం పడేలా ఉంటున్నాయి.పెరుగుతున్న సాంకేతికతను సక్రమంగా వినియోగిస్తే ఎంత ప్రయోజనమో, దుర్వినియోగం చేస్తే అంతే దుష్ఫలితాలున్నాయి.
అతుక్కుపోతున్న యువత
నలుగురు స్నేహితులు కలిస్తే కష్టసుఖాలు చెప్పుకునే రోజుల నుంచి నలుగురూ ఎవరి మొబైల్ వారు చూస్తూ కాలక్షేపం చేసుకునే రోజుల్లోకి చేరాం. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి దాకా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, మెసెంజర్, ఇతరత్రా సామాజిక మాధ్యమాలతో గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌లో డేంజర్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోయి ప్రాణాలు తీసుకున్నవారూ లేకపోలేదు. స్వలాభం, స్పప్రయోజనం కోసం దేశరక్షణ, భద్రతకు సంబంధించిన విషయాలతో పాటు ప్రజల్ని రెచ్చగొట్టేలా, మహిళల్ని కించపరిచేలా, యువతను చెడుమార్గం వైపు ఆకర్షితులయ్యేలా వీడియోలు చిత్రీకరించి అప్‌లోడ్ చేసి కటకటాలపాలైన వారు కోకొల్లలు.
నకిలీ ఖాతాలతో జాగ్రత్త..
సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నకొద్దీ అపరిచితులు తెలివిమీరుతున్నారు.. కొంతమంది యువకులు అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అంత తొందరగా గుర్తించలేని పరిస్థితి. ఇలాంటి అకౌంట్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేయడం, వారు పోస్ట్ చేసిన వీడియోలు, రీళ్లపై స్పందించడం జరుగుతోంది. వారిని ఫాలో చేస్తే భవిష్యత్తులో సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు లేకపోలేదు.
మహిళలూ బహుపరాక్..
- ఎవరినీ పూర్తిగా నమ్మొద్దు.. స్వేచ్ఛను సద్వినియోగం చేసుకునే ముసుగులో తప్పుడు మార్గంలో చిక్కుకునే ప్రమాదాన్ని ముందే గుర్తించాలి.
- మోసానికి గురైతే వెంటనే పోలీసులను సంప్రదించండి. ధైర్యంగా ఉండండి. ఆత్మన్యూనతకు గురికావద్దు
- మీపేరు, వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచుతారు. భయపడకుండా ఫిర్యాదు చేయాలి.
- చదువు, భవిష్యత్‌పై దృష్టి సారించండి. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిన వరకూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండండి
ఇలాంటివాటి జోలికి పోవద్దు..
- సామాజిక మాద్యమాలలో ఇతరులతో సంబంధాలు కొనసాగించడం మంచిది కాదు.
- అమ్మాయిలు అమర్యాదగా ఉండే ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయొద్దు. ఇలాంటి వాటిని మార్ఫింగ్ చేసే ప్రమాదం ఉంది.
- కొత్తవ్యక్తులను పూర్తిగా నమ్మవద్దు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు, మొబైల్‌నెంబర్ షేర్ చేయొద్దు.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
నాలుగేళ్ల చిన్నారి ఏడిస్తే చేతిలో మొబైల్ పెడుతున్న రోజులు.. కరోనా మహమ్మారి పుణ్యమాని మొబైల్ వినియోగం బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులు ఎలా వినియోగిస్తున్నారో పరిశీలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 12 నుంచి 20 ఏళ్లలోపు యువత ఎక్కువగా ల్యాప్‌టాప్, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు.. ఈ వయస్సులో ఉన్నవారంతా మంచికన్నా చెడువైపే ఎక్కువగా ఆకర్షితులవుతారని, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల వ్యవహారశైలిని తల్లిదండ్రులు గమనించకపోతే పక్కదారి పట్టే ప్రమాదం లేకపోలేదని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వినోదానికే పరిమితం కావాలి
డి.నవీన్‌కుమార్, సర్కిల్ ఇనస్పెక్టర్, రాజాం టౌన్
సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్న వీడియోలు, రీళ్లు వినోదం, విజ్ఞానానికి దోహదపడేలా ఉండాలి కాని చట్ట విరుద్ధంగా ఉండకూడదు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, మహిళలు.. చిన్నారులను భయబ్రాంతులకు గురిచేసేలా వీడియోలు చిత్రీకరించి పోస్ట్‌చేస్తే కఠిన చర్యలు తప్పవు.
నోట్! మొబైల్ చూడడంలో నిమగ్నమైన చిన్నారి 18ఆర్‌జెపి10
మైనర్లతో వీడియోలు చేయిస్తున్న అనిల్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన రాజాం పొలీసులు 18ఆర్‌జెపి11
నవీన్‌కుమార్ 18ఆర్‌జెపి12
రౌడీషీటర్‌కు రిమాండ్
రాజాం రూరల్, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఎనిమిది మంది మైనర్లతో చట్టవిరుద్దంగా వీడియోలు తీయించి తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసుకుంటున్న డోలపేటకు చెందిన రౌడీషీటర్ టొంపల అనిల్‌కుమార్‌ను రిమాండ్ కోసం శనివారం సాయంత్రం రాజాం ఎస్‌ఐ మహమ్మద్ సల్మాన్ బేగ్ ఆధ్వర్యంలో పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అతన్ని ఈనెల 17న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.
------------------------