Share News

Soaring prices పేలుతున్న ధరలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:37 PM

Soaring prices దీపావళి వచ్చేసింది. ఒకరోజు సమయం ఉన్నప్పటికీ పండగ కళ తొణికిసలాడుతోంది. అయితే మతాబులు కొనేందుకు దుకాణాలకు వెళ్తున్న వారికి మాత్రం ధరల షాక్‌ తగులుతోంది. బాణసంచా ధరలు నింగినంటుతున్నాయి.

Soaring prices పేలుతున్న ధరలు

పేలుతున్న ధరలు

చుక్కలనంటుతున్న బాణసంచా రేట్లు

పుట్టగొడుగుల్లా షాపులు

అగ్నిమాపక శాఖ అనుమతులు నామామాత్రం

తయారీ, విక్రయ కేంద్రాల వద్ద కానరాని నిబంధనలు

విజయనగరం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):

దీపావళి వచ్చేసింది. ఒకరోజు సమయం ఉన్నప్పటికీ పండగ కళ తొణికిసలాడుతోంది. అయితే మతాబులు కొనేందుకు దుకాణాలకు వెళ్తున్న వారికి మాత్రం ధరల షాక్‌ తగులుతోంది. బాణసంచా ధరలు నింగినంటుతున్నాయి. ఎంతో ఆశతో కొనేందుకు వెళ్తున్న వారు నిరాశ పడుతున్నారు. ఇంకోవైపు జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్రయాలకు సంబంధించి తాత్కాలిక షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. హోల్‌సేల్‌, రిటైల్‌ అమ్మకాలంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. అయితే అన్నిరకాల వస్తువులపై జీఎస్టీ తగ్గినా.. బాణసంచాపై తగ్గకపోవడంతో వాటి ధరలు పేలుతున్నాయి. జీఎస్టీ స్థిరంగా ఉంటే ధరలు కూడా స్థిరంగా ఉండాలి. కానీ జిల్లాలో మాత్రం ధరలు మండుతున్నాయి. ఇప్పటికే శాశ్వత లైసెన్స్‌ ఉన్న షాపుల్లో విక్రయాలు సాగుతుండగా.. తాత్కాలిక అనుమతులతో జిల్లా వ్యాప్తంగా వందలాది షాపులు వెలిశాయి. అయితే గత అనుభవాల దృష్ట్యా వీటి ధరలు, షాపుల ఏర్పాటులో నిబంధనలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వాస్తవానికి జిల్లాలో ముగ్గురు మాత్రమే శాశ్వత లైసెన్స్‌దారులు ఉన్నారు. 15 మంది వరకూ హోల్‌సేల్‌ విక్రయదారులు ఉన్నారు. అయితే వీరు తప్ప ఎవరూ అమ్మకాలు సాగించేందుకు వీలులేదు. కానీ తాత్కాలిక షాపులు పేరిట చాలా మందికి అనుమతులు మంజూరు చేసేశారు. వీరికి రెండు రోజుల పాటు అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు. జనావాసాల మధ్య, జాతీయ రహదారుల చెంత తాత్కాలిక షాపులు ఏర్పాటుచేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. విజయనగరం కేఎల్‌పురంలో షాపులను దూరంగా ఉంచాలని స్థానికులు కోరినా ఫలితం లేకపోయింది. 23వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటుచేస్తున్నారు. ఇది కూడా ఇబ్బందికరమే.

- జిల్లాలో బాణసంచా పేలుడు ప్రమాదాలు గతంలో జరిగాయి. బొబ్బిలి తారకరామ కాలనీ సమీపంలో ఐదేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. బాడంగిలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత పారాదిలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రెండేళ్ల కిందట దేవునికనపాకలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ప్రమాదాలు జరగలేదు కానీ గత అనుభవాల దృష్ట్యా మేల్కొనాల్సిన అవసరం ఉంది.

నిబంధనలను అనుసరించాలి

జిల్లాలో బాణసంచా విక్రయాలపై నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేపడితే చర్యలు తప్పవు. కచ్చితంగా ధరలకు అనుగుణంగానే విక్రయించాలి. తప్పకుండా రశీదులు ఇవ్వాలి. తయారీ, విక్రయ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలి.

- ఎస్‌.రామసుందర్‌రెడ్డి, కలెక్టర్‌

--------------

Updated Date - Nov 06 , 2026 | 11:37 PM