ఇప్పటికైతే భేష్
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:17 AM
కూటమి ప్రభుత్వం కొలువుదీరి నేటికి (గురువారం) రెండేళ్లు పూర్తవుతోంది. ఈ రెండళ్లలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇచ్చింది.
వందల కోట్లతో అభివృద్ధి పనులు
ఎన్నో రహదారులకు మోక్షం
వంతెనలు, ఆస్పత్రుల నిర్మాణం
గిరిజనులకు తప్పిన డోలీ మోతలు
పెండింగ్ పనులు కూడా పూర్తి చేసేందుకు కృషి
ఇదీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రత్యేకత
పార్వతీపురం, జూన్ 11(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కొలువుదీరి నేటికి (గురువారం) రెండేళ్లు పూర్తవుతోంది. ఈ రెండళ్లలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా పాలన పరిగెడుతోంది. జిల్లాలో వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రధానంగా రోడ్లు, కాలువలు, వంతెనలు, ఆస్పత్రులు నిర్మించారు. మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయి. భవిష్యత్తులో జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు జిల్లా ప్రజాప్రతి నిధులు కృషి చేస్తున్నారు. అయితే, కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే మూడేళ్లలో వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
చేసిన అభివృద్ధి పనులు..
- సాలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం మండలాల ప్రజలతోపాటు ఒడిశాలోని అనేక గ్రామాల ప్రజలకు వైద్య కష్టాలను తీర్చేందుకు వంద పడకలను ఆస్పత్రిని ప్రారంభించింది. 30 పడకలుగా ఈ ఆసుపత్రిని రూ.18 కోట్ల నిధులతో వంద పడకలుగా మార్చారు.
- తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి రూ.47.8 కోట్లు మంజూరు చేసింది. రూ.32 కోట్లతో డిస్ట్రిబ్యూటరీతో పాటు కెనాల్స్ పనులు, రూ.6.78 కోట్లతో భూసేకరణ, రూ.9.03 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
- సాలూరు, కురుపాం, పాలకొండ, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు వంద గిరిజన గ్రామాలకు రూ.400 కోట్లతో బీటీ రహదారులు నిర్మించారు. మక్కువ మండలంలో దుగ్గేరి-మండల్, పార్వతీపురం నియోజకవర్గంలో చిన్న మరాయుడుపేట జంక్షన్ నుంచి పులుగుమ్మి, ములుగ నుంచి తేలునాయుడు వలస తదితర గ్రామాలకు రహదారులు నిర్మించారు. కురుపాం నియోజకవర్గంలో రెళ్ల నుంచి కొత్తవలస, కొమరాడ మండలంలో గంగభద్ర నుంచి అంకులవలస, సరవ గుణడ నుంచి బిన్నిడి తదితర గ్రామాలకు బీటీ రహదారులను నిర్మించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జిల్లాలో సీసీ రహదారులతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు.
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంతెనలు, అనేక రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. సీతానగరం మండల కేంద్రంలో వంతెనను రూ.12 కోట్లతో పూర్తి చేసింది. మక్కువ-అజ్జాడ రోడ్డును రూ.41 కోట్లతో, బలిజిపేట- పనుకువలస-కొత్తపల్లి రోడ్డును రూ.1.50కోట్లతో నిర్మించారు.
- గిరిజన గ్రామాల్లో స్థానికంగా వైద్య అందించడంతో పాటు డోలీ మోతాలను తప్పించేందుకు కంటైనర్ ఆస్పత్రిని నెలకొల్పింది. సాలూరు మండలం కరడవలస గిరిజన గ్రామంలో ఈ ఆస్పత్రిని ప్రారంభించి వైద్యుడితో పాటు సిబ్బందిని నియమించింది. ఇక్కడ బీసీ, షుగర్ పరీక్షలతో పాటు 105 రకాల వైద్య సేవలను అందిస్తున్నారు.
- జిల్లా వాసులకు గజరాజుల బెడదను తప్పించేందుకు సీతానగరం మండలం గుచ్చిమిలో ఏనుగుల షెల్టర్ జోన్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసి జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులను ఈ షెల్టర్‌లోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏనుగుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుంకి ఏనుగును జిల్లాకు రప్పించనున్నారు.
- సాలూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెద్దగెడ్డ రిజర్వాయర్ నుంచి సాలూరుకు తాగునీటిని సరఫరా చేసేందుకు సుమారు రూ.100 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసింది. ఈ పనులు పూర్తయితే సాలూరు ప్రజల తాగునీటి కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.
- జిల్లా కేంద్రం పార్వతీపురంలో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించేందుకు రీసైక్లింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. దీనివల్ల పట్టణ ప్రజలకు కొంతమేర ఇబ్బందులు తప్పాయి.
- గుమ్మలక్ష్మీపురం మండలంలో నిలిచిపోయిన స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి ఇంకెప్పుడు?
పూర్తికాని ఆసుపత్రుల నిర్మాణం
పార్వతీపురంలో తాగునీటి కష్టాలు
జిల్లా కేంద్రంల బైపాస్ రోడ్డు ఏమైంది?
ట్రైబల్ యూనివర్శిటీలో పురోగతి ఏదీ?
అడారు పూర్తయితే 600 ఎకరాలకు నీరు
-జిల్లాలోని సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణా లు రెండేళ్లవుతున్నా పూర్తికాలేదు. పార్వతీపురంలో రూ.49.26కోట్ల అంచనాతో చేపడుతున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ఇప్పటివరకు రూ.12.5 కోట్ల పనులు(40 శాతం) పూరయ్యాయి. ఇంకా రూ.37 కోట్ల పనులు (60 శాతం) పూర్తి చేయాల్సి ఉంది. సీతంపేట మండల కేంద్రంలో రూ.35 కోట్ల అంచనాతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 75శాతం పనులు జరగ్గా ఇంకా 25శాతం పెండింగ్ ఉన్నాయి.
- జిల్లా కేంద్రం పార్వతీపురంలో తాగునీటి సమస్య ప్రజలను వెంటాడుతోంది. తోటపల్లి ప్రాజెక్టు నుంచి కాకుండా జంఝావతి ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తామన్న ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, నేటికీ ఆ దిశాగా అడుగులు పడలేదు. దీంతో వేసవి కాలంలో దాహం కేకలు, వర్షాకాలంలో బురదనీటి సమస్యతో జిల్లా కేంద్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- పార్వతీపురానికి బైపాస్ రహదారి ఎంతో అవసరం. దీనిపై గత ఎన్నికల్లో కూటమి నాయకులు హామీనిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తియినా బైపాస్ రహదారి ఊసేలేదు.
- గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశించారు. కానీ, రెండేళ్లు అవుతున్నా ఆ పనులు ప్రారంభం కాలేదు. దీంతో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదే విధంగా వైద్య కళాశాల నిర్మాణం కూడా జరగడం లేదు.
- కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు వంతెన పెండింగ్ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పార్వతీపురం నియోజకవర్గంలో అడారు రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడడం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. పూర్తయితే సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
-జంఝావతి హైలెవెల్ కెనాల్ ద్వారా సాగునీటి కోసం పార్వతీపురం నియోజకవర్గ రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కావడం లేదు.