Share News

Snakebites on the Rise! కాటేస్తున్నాయ్‌!

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:46 PM

Snakebites on the Rise! జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు వ్యక్తులు పాము కాటుకు గురికావడం కలకలం రేపింది. వారిలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉంది. వారంతా శని, ఆదివారాల్లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.

Snakebites on the Rise! కాటేస్తున్నాయ్‌!

  • పాము కాటుకు గురైన రైతులు, విద్యార్థిని

  • ఆసుపత్రిలో చికిత్స .. ఒకరి డిశ్చార్జి

జియ్యమ్మవలస, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు వ్యక్తులు పాము కాటుకు గురికావడం కలకలం రేపింది. వారిలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉంది. వారంతా శని, ఆదివారాల్లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. వివరాల్లోకి వెళ్తే.. పరజపాడు పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వాన సంగంనాయుడు శనివారం సాయంత్రం పొలంలో నారు మడి బాగు చేస్తుండగా పాము కాటు వేసింది. ఆ గ్రామానికి చెందిన గుంట్రెడ్డి రవికుమార్‌ పొలంలోకి నీరు మళ్లిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. కన్నపుదొరవలస గ్రామంలో తోటి పిల్లలతో సరదాగా ఆటాడుకుంటున్న 6వ తరగతి విద్యార్ధిని వై.జనని కూడా పాము కాటుకు గురైంది. కుదమ పంచాయతీ చినకుదమకి చెందిన గేదెల సింహాచలం పొలం పని చేస్తుండగానే ఆయనకు పాము కాటు వేసింది. వారంతా చినమేరంగి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. బాధితుల్లో గేదెల సింహాచలం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్జి అయ్యారు. ఇదిలాఉండగా ఆదివారం ఉదయం చినకుదమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి జి.గంగరాజు పొలంలో పార పని చేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. ఆయన కూడా చినమేరంగి సీహెచ్‌సీకి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు.

ఏటా పెరుగుతున్న కేసులు

గుమ్మలక్ష్మీపురం: ఏటా వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పాముకాటు కేసులు పెరుగుతున్నాయి. వాటిల్లో రైతులు అధికంగా ఉంటున్నారు. ఈ వారంలోనే కురుపాం మండలానికి చెందిన ఓ వ్యక్తి పాముకాటుకు గురై చనిపోయాడు. వాస్తవంగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ తదితర గిరిజన ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో కింగ్‌కోబ్రా, నాగుపాములు, రక్తపింజర వంటివి సంచరిస్తున్నాయి. వాటివల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగకముందే అటవీ, వైద్య శాఖల సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పాముకాటు మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

‘వర్షాకాలం నేపథ్యంలో పొలం పనులకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రాత్రిపూట ఇళ్లలోకి కూడా విష సర్పాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, తుప్పలు, డొంకలు లేకుండా చూసుకోవాలి. పాముకాటుకు గురైన వారిని వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడం మంచిది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ’ అని తాడికొండ పీహెచ్‌సీ వైద్యుడు బుద్ధేశ్వరరావు తెలిపారు.

Updated Date - Aug 02 , 2026 | 11:46 PM