Snakebite treatment in a 108 ambulance 108 వాహనంలో పాముకాటుకు చికిత్స
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:51 PM
Snakebite treatment in a 108 ambulance అత్యవసర సమయాల్లో సేవలు అందించే 108 వాహనాల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వడదెబ్బ తగిలిన వారికి తక్షణ ఉపశమనం కలిగించే ఐస్‌ప్యాక్‌లు, పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తూ పాము కాటుకు గురైన వారికి యాంటీస్నేక్‌వేనమ్ సూదిమందును అందుబాటులోకి తీసుకొచ్చారు.
108 వాహనంలో
పాముకాటుకు చికిత్స
ప్రతి వాహనంలో అందుబాటులో రెండు ఇంజెక్షన్‌లు
ఐస్ ప్యాక్‌లను కూడా సమకూర్చిన ప్రభుత్వం
గజపతినగరం, జూన్16(ఆంధ్రజ్యోతి): అత్యవసర సమయాల్లో సేవలు అందించే 108 వాహనాల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వడదెబ్బ తగిలిన వారికి తక్షణ ఉపశమనం కలిగించే ఐస్‌ప్యాక్‌లు, పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తూ పాము కాటుకు గురైన వారికి యాంటీస్నేక్‌వేనమ్ సూదిమందును అందుబాటులోకి తీసుకొచ్చారు.
జిల్లాలో 28 అంబులెన్సులున్నాయి. ప్రమాదాలు, అనారోగ్యసమస్యలు ప్రసవాల కోసం వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. రోజూ సుమారు 50నుంచి 60 మందికి సేవలు అందుతున్నాయి. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి వీటిలో ప్రాథమిక వైద్యం అందుతుంది. తాజాగా మరిన్ని సేవలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాముకాటుకు గురైన వ్యక్తికి విరుగుడు కోసం ఇచ్చే మందును ప్రతీ వాహనంలో రెండు ఇంజక్షన్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే వడదెబ్బ బాధితునికి ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ బాటిల్, తడి టవల్, కూలింగ్ వాటర్ బాటిల్‌ను కిట్ రూపంలో అందివ్వనున్నారు. ఈఏడాది సూపర్ ఎల్‌నినోను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ అంబులెన్స్‌కు ఒక బాక్స్‌ను ప్రత్యేకంగా అందించింది. అందులో ఐస్ ప్యాక్‌లతో పాటు ఒక టవల్‌ను ఉంచారు. అవసరమైతే సెలైన్ ఎక్కిస్తారు. లేని పక్షంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. వాహనంలో ఐస్ ప్యాక్‌లు ఉండే బాక్స్‌లోనే నెలరోజులుగా పాము కాటు విరుగుడుకు మందులను ఉంచుతున్నామని 108 వాహనాల జిల్లా మేనేజర్ మన్మథనాయుడు తెలిపారు. అత్యవసర సమయంలో ప్రజలు ఈసేవలను వినియోగించుకోవాలని కోరారు.