Smooth Travel Ahead ఇక సాఫీగా ప్రయాణం
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:00 AM
Smooth Travel Ahead సీతానగరం మండల కేంద్రంలోని సువర్ణముఖి నదిపై చేపడుతున్న వంతెన పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొద్దిరోజుల్లో దీనిని ప్రారంభించనున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఉమ్మడి జిల్లాతో పాటు ఒడిశావాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి.
కూటమి ప్రభుత్వం చొరవతో చురుగ్గా నిర్మాణం
కొద్దిరోజుల్లోనే ప్రారంభోత్సవం
సీతానగరం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): సీతానగరం మండల కేంద్రంలోని సువర్ణముఖి నదిపై చేపడుతున్న వంతెన పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొద్దిరోజుల్లో దీనిని ప్రారంభించనున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఉమ్మడి జిల్లాతో పాటు ఒడిశావాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం రాయగడ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు ఈ వంతెన మీదుగా ఇకపై సాఫీగా వాహనాలు రాకపోకలు సాగించే వీలుంది. బొబ్బిలి-రాయగడ అంతర్రాష్ట రహదారిపై సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ నూతన వంతెన నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇందుకోసం అప్పట్లో రూ.12 కోట్లు కూడా మంజూరు చేశారు. అయితే ఆతర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులకు మోక్షం కలగలేదు. నత్తనడకన నిర్మాణం సాగింది. దీంతో వాహనదారులు, ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యపై దృష్టి సారించింది. పెండింగ్ బిల్లులు చెల్లించి.. పనులు పునఃప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టింది. మొత్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణం పూర్తవడంతో ఉమ్మడి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రూ.5.40 కోట్ల ఎస్‌డీపీ నిధులతో ఇదే మండలంలో గెడ్డలుప్పి సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజల రహదారి కష్టాలు గట్టెక్కాయి. సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం పూర్తయిందని డీఈ అప్పాజీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.