Share News

SMC Elections ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:55 PM

SMC Elections Held Peacefully జిల్లాలో 1,583 ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కోరం లేక 11 చోట్ల వాయిదా పడగా.. పిల్లులు పూర్తిగా లేని నాలుగు పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించలేదు.

SMC Elections   ప్రశాంతంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
పాంచాలి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నిక నిర్వహిస్తున్న దృశ్యం

పిల్లలు లేక నాలుగుచోట్ల చేపట్టని ప్రక్రియ

1568 బడుల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు

పార్వతీపురం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 1,583 ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కోరం లేక 11 చోట్ల వాయిదా పడగా.. పిల్లులు పూర్తిగా లేని నాలుగు పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించలేదు. మక్కువ, ములక్కాయవలస, భామిని మండలంలో కేసర, పాలకొండ మండలంలో దుగ్గి, పార్వతీపురం మండలంలో జమ్మిడివలస, బందలుప్పి, పాచిపెంట, కర్రివలస, కేసలి, సాలూరు మండలంలో బాగువలస, పురోహితునివలస పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. బలిజిపేట మండలంలో వంజరంపేట, జియ్యమ్మవలస మండలంలో నేల మాంబపురం, కొమరాడ మండలం చెక్కవలస, పార్వతీపురం మండలం పులిగుమ్మి పాఠశాలల్లో విద్యార్థులు పూర్తిగా లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అయితే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియ ముగియడంతో విద్యాశాఖాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలోని 15 చోట్ల మినహా మిగిలిన పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. మక్కువలో ఎన్నికలు జరపాలని కోరినా.. ప్రశాంత వాతావరణం లేకపోవడంతో అక్కడ వాయిదా వేశామన్నారు.

పలుచోట్ల ఇలా..

- మక్కువలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జడ్పీ ఉన్నత పాఠశాలలో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య చెలరేగిన వివాదంతో ఎన్నిక వాయిదా పడింది. సీక్రెట్‌ ఓటింగ్‌ ద్వారా ఎన్నిక నిర్వహించాలని టీడీపీ మద్దతుదారులు కోరారు. అయితే బహిరంగంగా చేతులెత్తే విధానంలోనే ఓటింగ్‌ జరపాలని వైసీపీ మద్దతుదారులు డిమాండ్‌ చేశారు. దీంతో వారి మధ్య వాదనలు పెరగడంతో ఎస్‌ఎంసీ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు హెచ్‌ఎం జి.రోజారాణి ప్రకటిం చారు. ఆ తర్వాత వైసీపీ మద్దతుదారులు స్కూల్‌ బయట గంటన్నర సేపు ధర్నా చేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నిక జరుగుతుందని సర్దిచెప్పడంతో వివాదానికి తెరపడింది.

- చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు తమకే కావాలని కొత్తూరులో జనసేన, టీడీపీ మద్దతుదారులు, గరుగుబిల్లిలో టీడీపీ, బీజేపీ మద్దతుదారుల మధ్య వాదనలు జరిగాయి. ఆ తర్వాత వారిలో వారే చర్చించుకుని ఎన్నిక సజావుగా జరిగేలా చూశారు.

- సాలూరు మండలం బాగువలస ఉన్నత పాఠశాలలో సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయినప్పటికీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ ఎన్నిక వాయిదా వేసినట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు.

Updated Date - Sep 29 , 2026 | 11:55 PM