Chicken at ₹110/kg.. Vegetables at ₹15! కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ. 110.. కూరగాయలు రూ.15
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:34 AM
Skinless Chicken at ₹110/kg.. Vegetables at ₹15! సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాసంస్థలకు ఏటా సరఫరా చేసే కూరగాయల్లో నాణ్యత కొరవడుతోంది. టెండర్ల సమయంలో అతితక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు, సరుకులు అందిస్తామని ముందుకొస్తున్న కాంట్రాక్టర్లు.. సరఫరా సమయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.
మార్కెట్ కంటే అతి తక్కువ ధరకు కోట్ చేస్తున్న వైనం
సరఫరా చేయలేమని తెలిసినా ముందుకొచ్చిన టెండర్‌దారులు
సీతంపేట ఐటీడీఏలో ప్రతిఏటా ఇదే పరిస్థితి
నాసిరకం సరకులు, కుళ్లిన కూరగాయలు అందిస్తున్నా పట్టని సిబ్బంది
హెచ్చరికలతోనే సరిపెడుతున్న అధికారులు
గిరిజన విద్యార్థులకు అందని నాణ్యమైన పౌష్టికాహారం
సీతంపేట, సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాసంస్థలకు ఏటా సరఫరా చేసే కూరగాయల్లో నాణ్యత కొరవడుతోంది. టెండర్ల సమయంలో అతితక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు, సరుకులు అందిస్తామని ముందుకొస్తున్న కాంట్రాక్టర్లు.. సరఫరా సమయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. చాలాచోట్ల కుళ్లిన కూరగాయలు సరఫరా చేస్తుండగా.. నిత్యావసర సరుకుల్లో కూడా నాణ్యత లోపిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యా సంస్థలకు సరుకులు సరఫరా చేసే సమయంలో ఆయా పాఠశాలల ప్రిన్నిపాల్స్, వార్డెన్లు నాణ్యతపై ప్రశ్నించడం లేదు. దీనిపై అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. దీంతో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందడం లేదు. ఏటా ఈ పరిస్థితి నెలకొన్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. కేవలం హెచ్చరికలతోనే సరిపెడుతుండడంపై సర్వత్రా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
- గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయాలు తదితర వాటి సరఫరాకు సంబంధించి ఏటా ఐటీడీఏ వేదికగా టెండర్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ పక్రియలో బహిరంగ మార్కెట్‌లో ఉండే ధరల కంటే అతితక్కువకు టెండర్‌దారులు కోడ్ చేసి సరఫరా చేసేందుకు ముందుకు రావడం వెనుక గల మాయాజాలం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
- ఈ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనే టెండర్‌దారులు మాత్రమే హాజరవడం పరిపాటిగా వస్తోంది. సీల్డ్ టెండర్‌లను దాఖలు చేసే సమయం నుంచి టెండర్లను నిర్వహించే ప్రక్రియ వరకు ప్రతీది టెండర్‌దారుల కనుసన్నల్లో జరగడం విశేషం.
- అధికారులు టెండర్‌లు నిర్వహించే సమయంలో టెండర్‌దారులు అందరూ సిండికేట్‌గా మారి బహిరంగ మార్కెట్‌లో ఉండే ధరలకంటే కారుచౌకగా కేజీల లెక్కన ధరలను కోడ్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
- ఈఏడాది(2026-27)కి సంబంధించి గత నెల 19వ తేదీన 12 గురుకుల విద్యాసంస్థలకు కూరగాయలతో పాటు స్కిన్‌లెస్ చికెన్, సీజనల్ ఫ్రూట్స్ సరఫరాకు సంబంధించి టెండర్ల ప్రక్రియ నిర్వహిం చారు. మొత్తంగా 15 రకాల కూరగాయలు, స్కిన్‌లెస్ చికెన్, అరటి, జామపండ్లు, సీజనల్ ఫ్రూట్స్‌ను గత ఏడాది కంటే తక్కువ ధరకు వీటిని పంపిణీ చేసేందుకు టెండర్‌దారులు ముందుకు రావడం విశేషం. దీంతో ఎవరైతే తక్కువ ధరకు కోడ్ చేశారో వారికే ఆయా గురుకుల విద్యాసంస్థలకు సరుకుల సరఫరాకు గురువారం ఇన్‌చార్జి పీవో అనుమతులు ఇచ్చారు.
- ఈఏడాది ఎల్‌నినో ప్రభావం పంటలపై ఎక్కువగా పడింది. లోటు వర్షపాతం ప్రభావంతో పంటలు సక్రమంగా పండకపోవడంతో కూరగాయలు, ఆయిల్, పంచదార, పెసర, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు ఆకాశా న్నంటుతున్నాయి. ఈనేపథ్యంలో ఐటీడీఏ పరిధిలో గిరిజ విద్యాసంస్థలకు అతితక్కువ ధరకు సరుకులు, కూరగాయలు సరఫరా చేస్తామని టెండర్‌లు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
జీసీసీ టెండర్లు ఇలా..
- ఇదిలా ఉండగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, పోస్టుమెట్రిక్ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలకు సంబంధించి జీసీసీ ద్వారా మూడు నెలలకు అవసరమైన సరకులు సరఫరాకు సంబంధించి ఈనెల 3న ఐటీడీఏ కార్యాలయంలో మరో టెండర్‌ను నిర్వహించారు. ఇక్కడ కూడా బహిరంగ మార్కెట్‌లో ఇప్పుడున్న ధరలకంటే అతితక్కువకు 25రకాల సరుకులతో పాటు విద్యార్థులకు అవసరమైన 10రకాల కాస్మెటిక్స్‌ను సరఫరా చేస్తామని 15మంది టెండర్‌దారులు పోటీపడ్డారు.
- ఆశ్రమ పాఠశాలలకు మూడు నెలలకు గాను అవసరమైన నిత్యావసర సరుకుల సరఫరాకు సంబంధించి జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్‌ల ధరలు కూడా ఇలా ఉన్నాయి. కిలో కందిపప్పు ధర మార్కెట్‌లో రూ.140 ఉండగా టెండర్‌లో రూ.114కి ఖారారైంది. కిలో శనగపప్పు ధర రూ.110ఉండగా రూ.80కి ఖరారు చేశారు. పెసరపప్పు ధర రూ.120 ఉండగా రూ.96.50కి ఖరారు చేశారు. కిలో మినపగుళ్లు ధర రూ.140ఉండగా రూ.117కి కోడ్ చేశారు. ఇలా మిగిలిన సరుకులు కూడా మార్కెట్ ధర కంటే అతితక్కువకు కోడ్‌చేసి సరఫరా చేసేందుకు టెండర్‌దారులు ముందుకు వచ్చారు. అయితే ఈ టెండర్‌లకు సంబంధించి ఐటీడీఏ పీవో నుంచి అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈఏడాదికి కూరగాయలు, ఇతరాత్ర సరుకుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.230వరకు పలుకుతోంది. కూరగాయాల ధరలు కూడా మండిపోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా ఈఏడాది మార్కెట్‌లో ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరి టెండర్‌దారులు ఏ మేరకు ఏడాది పాటు వీటిని సరఫరా చేస్తారో లేక మధ్యలో చేతులెత్తేస్తారో వేచిచూడాల్సి ఉంది.
ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే..
‘గిరిజన విద్యా సంస్థలకు కూరగాయలు, నిత్యావసర సరుకుల సరఫరాలో నాణ్యత పాటించకుంటే సంబంధిత టెండర్‌దారుడిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం. ఈ విషయాన్ని టెండర్లు నిర్వహించిన సమయంలోనే టెండర్‌దారులకు తెలియజేశాం. నాణ్యతలో రాజీపడే ప్రసక్తిలేదు. నిబంధనల ప్రకారం నాణ్యతతో కూడిన సరుకులు మాత్రమే సరఫరా చేయాలి. ఎప్పటికప్పుడు మా నిఘా ఉంటుంది. ’ అని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.