Six Rurban Panchayats ఆరు రూర్బన్ పంచాయతీలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:10 AM
Six Rurban Panchayats జిల్లాలో గ్రామ పంచాయతీల స్వరూపం మారనుంది. ఇక నుంచి రూర్బన్ పంచాయతీలు రానున్నాయి. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామ పంచాయతీలకు సంబంధించి నూతన సంస్కరణలను తీసుకొచ్చింది. గ్రామపంచాయతీల పునర్వర్గీకరణకు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఆరు రూర్బన్ పంచాయతీలు
10 వేల జనాభా, కోటి ఆదాయమే ప్రామాణికం
మిగతావి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలు
ప్రభుత్వ కీలక నిర్ణయం
విజయనగరం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల స్వరూపం మారనుంది. ఇక నుంచి రూర్బన్ పంచాయతీలు రానున్నాయి. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామ పంచాయతీలకు సంబంధించి నూతన సంస్కరణలను తీసుకొచ్చింది. గ్రామపంచాయతీల పునర్వర్గీకరణకు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ ప్రకారం పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. జనాభాతో పాటు వార్షిక ఆదాయం అనుసరించి విభజన చేయనున్నారు. కొత్తగా రూర్బన్ పంచాయతీలు రానున్నాయి. మేజర్ పంచాయతీ కంటే గ్రేడ్ ఎక్కువగా ఉండనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేజర్ పంచాయతీ, నగర పంచాయతీ మధ్య రూర్బన్ పంచాయతీ రానుందన్న మాట. జిల్లాలో 27 మండలాల్లో 777 పంచాయతీలు ఉండగా 2011 జనాభా లెక్కలు, మూడేళ్ల సగటు ఆదాయం పరిగణనలోకి తీసుకొని పంచాయతీలను నాలుగు విభాగాలుగా విభజించనున్నారు.
రూర్బన్ పంచాయతీలు ఇవే..
పంచాయతీలను ఆదాయపరంగా చివరిసారిగా 2008లో వర్గీకరించారు. మళ్లీ ఇన్నాళ్లకు వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 10 వేల జనాభా కంటే అధికంగా ఉన్న పంచాయతీలు రూర్బన్ పంచాయతీల పరిధిలోకి రానున్నాయి. వార్షిక ఆదాయం రూ.కోటికి దాటాలి. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే జనాభా 5 వేల కంటే ఎక్కువగా ఉండాలి. పది వేల కంటే తక్కువగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిల్లాలో ఎస్.కోట, కొత్తవలస, చీపురుపల్లి, కొండపాలెం (గరివిడి), జామి, రామచంద్రాపురం పంచాయతీలు రూర్బన్ పంచాయతీలుగా మారనున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. జామి, రామభద్రపురం గ్రేడ్-2 పంచాయతీలుగా ప్రస్తుతం ఉండగా రూర్బన్ పంచాయతీలుగా మారనున్నాయి.
ఇలా విభజించారు..
గ్రేడ్1 పంచాయతీలకు సంబంధించి జనాభా 3 వేల నుంచి 10 వేల మధ్య ఉండాలి. వార్షిక ఆదాయం రూ.30 లక్షల కంటే ఎక్కువగా ఉండాలి. ఆదాయం రూ.కోటి కంటే తక్కువగా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అయితే జనాభా 2500 నుంచి 5 వేల మధ్య ఉంటే చాలు.
మూడోది గ్రేడ్2 పంచాయతీలు. ఇక్కడ జనాభా 2 వేల కంటే తక్కువగా ఉంటారు. గిరిజన ప్రాంతాల్లో 1500 మంది కంటే ఎక్కువగా ఉంటే చాలు.
నాలుగోది గ్రేడ్-3. ఇక్కడ 1500 కంటే తక్కువ జనాభా ఉంటే పరిగణిస్తారు. ఇలా నాలుగు విభాగాలుగా పంచాయతీలను విభజించారు.
మౌలిక వసతుల కల్పనకు..
పంచాయతీలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ విభజన జరిగింది. ఇప్పటివరకూ ఉన్న క్లస్టర్ విధానాన్ని రద్దుచేశారు. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు మండల కేంద్రాలన్నీ గ్రేడ్1 పంచాయతీలుగా మారనున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారులను బాధ్యులుగా నియమిస్తారు. పట్టణ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడతారు. ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ ద్వారా వచ్చే ఆదాయంలో సగం వాటాను గ్రామ పంచాయతీలకు నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు, ఇంజనీరింగ్ పనుల్లో పూర్తిగా పారదర్శకత కలుగుతుందన్న ప్రభుత్వం భావిస్తోంది.
పారదర్శక పాలనే లక్ష్యం
పంచాయతీల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. అందుకు తగ్గట్టుగా జిల్లా నుంచి సమగ్ర సమాచారాన్ని పంపించాం. జీవో విడుదల చేసింది. రూర్బన్ పంచాయతీలు-6 (చీపురుపల్లి, గరివిడి మండలం కొండపాలెం, జామి, కొత్తవలస, రామభధ్రాపురం, ఎస్.కోట) గ్రేడ్ 1- 110, గ్రేడ్ 2- 152, గ్రేడ్ 3- 509 మొత్తంగా 777 పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన ప్రక్రియ ఉంటుంది. పాలనతో పాటు మౌలిక వసతుల కల్పనకు, పారదర్శక సేవలకు ఇది ఎంతగానో దోహదపడనుంది.
- డీవీ మల్లికార్జునరావు, జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం
===