Share News

చెల్లని చెక్కు ఇచ్చినందుకు ఆరు నెలల జైలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:10 AM

చెల్లని చెక్కు ఇచ్చినందుకు ఓ వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ కొత్తవలస న్యాయాధికారి డా.సముద్రాల విజయ్‌చందర్‌ తీర్పుచెప్పారు.

చెల్లని చెక్కు ఇచ్చినందుకు ఆరు నెలల జైలు

కొత్తవలస, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): చెల్లని చెక్కు ఇచ్చినందుకు ఓ వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ కొత్తవలస న్యాయాధికారి డా.సముద్రాల విజయ్‌చందర్‌ తీర్పుచెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన సీహెచ్‌ గోవిందరాజు మండలంలోని మంగళపాలెం గ్రామానికి పొలమరశెట్టి కరుణకుమార్‌ అనే వ్యక్తి నుంచి తన కుటుంబ అవసరాల నిమిత్తం 2015వ సంవత్సరం, ఫిబ్రవరి నెల 15వ తేదీన అప్పు తీసుకుని ప్రామసరీ నోటు రాయించి.. ఇచ్చాడు. తన డబ్బులు తనకు ఇవ్వాలని గోవిందరాజును కరుణకుమార్‌ కోరగా.. అదే సంవత్సరం డిసెంబరు 15వ తేదీన ఒక చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును కరుణకుమార్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేయగా బ్యాంక్‌లో డబ్బులులేని కారణంగా బౌన్స్‌అయింది. ఈ విషయాన్ని కరుణకుమార్‌ గోవిందరాజు దృష్టికి తీసుకెళ్లగా కొద్ది రోజుల తర్వాత చెక్‌ను డిపాజిట్‌ చేస్తే ఈలోగా బ్యాంకులో డబ్బులు వేస్తానని చెప్పడంతో మరికొద్ది రోజులు ఆగి మళ్లీ 2016 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన జమచేయగా మళ్లీ డబ్బులు లేని కారణంగా చెక్‌ బౌన్స్‌ అయ్యింది. దీంతో కరుణకుమార్‌ కొత్తవలస కోర్టులో కేసు వేశారు. ఈ కేసు సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత నిందితుడు గోవిందరాజుపై వేసిన కేసులో నేరం రుజువు అయ్యింది. దీంతో ఆరు నెలలు జైలుశిక్ష విధించారు. రూ.6 లక్షలతోపాటు 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని గోవిందరాజును న్యాయాధికారి ఆదేశించారు. అసలూ, వడ్డీ చెల్లించకపోతే మరో మూడు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో చెప్పారు.

Updated Date - Oct 10 , 2026 | 12:10 AM