Share News

Waiting ఆరు దశాబ్దాలుగా ఎదురుచూపు

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:50 PM

Six Decades of Waiting వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన ఉన్న కాజ్‌వే వద్ద మినీ వంతెన నిర్మాణం చేపట్టాలని 60 ఏళ్లుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వారి గోడును పట్టించుకునే వారే కరుయవ్యారు. దీంతో వర్షాకాలంలో ఆయా గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి కారణంగా బయట ప్రపంచంతో వారికి పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయి.

  Waiting ఆరు దశాబ్దాలుగా  ఎదురుచూపు
కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు (ఫైల్‌)

  • వర్షాకాలంలో గిరిజనులకు తప్పని ఇబ్బందులు

  • వరద ఉధృతి పెరిగితే 30 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్‌

జియ్యమ్మవలస, మార్చి3(ఆంధ్రజ్యోతి): వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన ఉన్న కాజ్‌వే వద్ద మినీ వంతెన నిర్మాణం చేపట్టాలని 60 ఏళ్లుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వారి గోడును పట్టించుకునే వారే కరుయవ్యారు. దీంతో వర్షాకాలంలో ఆయా గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి కారణంగా బయట ప్రపంచంతో వారికి పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయి. వాస్తవంగా తూర్పు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే మార్గానికి వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన ఉన్న ప్రధాన రహదారే కీలకం. టీకే జమ్ము, పీటీ మండ, కొండ చిలకాం, అలమండ పంచాయతీల పరిధిలో సుమారు 30 గిరిజన గ్రామాల ప్రజలు నిత్యం ఈ దారి గుండానే ప్రయాణిస్తుంటారు. విద్య, వైద్యంతో పాటు పంటలు, అటవీ ఉత్పత్తుల విక్రయాలు, నిత్యావసర సరుకుల కోసం.. ఈ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వరదలొస్తే.. వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగవన ఉన్న కాజ్‌వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఏడాదిలో నాలుగైదు నెలల పాటు ఉంటుంది. ఆ సమయంలో గిరిజనులు ఇళ్లు వదిలి బయటకు రాలేకపోతున్నారు. గతంలో పలు ప్రమాదాలు సంభవించడంతో కాజ్‌వేపై వరద ఉధృతి దాటి రావడానికి ఎవరూ సాహించడం లేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు మరో 30 కిలో మీటర్లు చుట్టూ తిరిగి జిల్లాకేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. అదే ఇక్కడ మినీ వంతెన నిర్మాణం జరిగితే గిరిజన గ్రామాలన్నింటికీ అన్ని విధాలా మేలు చేకూరుతుంది. కురుపాం మండలంలో ఉన్న శివారు ఎన్నో గ్రామాల ప్రజలు కూడా జిల్లా కేంద్రానికి తక్కువ వ్యవధిలో చేరుకోగలుగుతారు. గతంలో ఈ మినీ వంతెన నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించినా.. పనులేవీ చేపట్టలేదు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై కురుపాం సబ్‌ డివిజన్‌ ఆర్‌అండ్‌బీ ఏఈ సుశీలను వివరణ కోరగా.. ‘వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువ కాజ్‌వే వద్ద మినీ వంతెన నిర్మాణం విషయంలో రెండుసార్లు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు చేపడతాం. ’ అని తెలిపారు.

Updated Date - Mar 03 , 2026 | 11:50 PM