Share News

Sirimanu festival is today నేడే సిరిమాను సంబరం

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:23 AM

Sirimanu festival is today పైడిమాంబ సిరిమాను సంబరానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అమ్మవారు సిరిమానుపై ప్రజల వద్దకు రానున్నారు. ఆమె ప్రతిరూపంగా పూజారి వెంకటరావు సిరిమానును అధిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులంతా నగరానికి చేరుకున్నారు.

Sirimanu festival is today నేడే సిరిమాను సంబరం
మూడు లాంతర్ల వద్ద భక్తులు, ఘటాల కోలాహలం

నేడే సిరిమాను సంబరం

ఊరేగింపునకు ఏర్పాట్లు పూర్తి

3,500 మందితో పోలీసు బందోబస్తు

పైడిమాంబను దర్శించుకోనున్న గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు

పట్టు వస్త్రాలు సమర్పించనున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

పైడిమాంబ సిరిమాను సంబరానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అమ్మవారు సిరిమానుపై ప్రజల వద్దకు రానున్నారు. ఆమె ప్రతిరూపంగా పూజారి వెంకటరావు సిరిమానును అధిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులంతా నగరానికి చేరుకున్నారు. విజయనగరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ పండగకు రావడం.. సిరి సంబరాన్ని వీక్షించడం ఆనవాయితీ. ఊరేగింపునకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిరిమానోత్సవానికి లక్షలాదిగా భక్తజనం రానున్నారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ 3,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేసింది. హుకుంపేట నుంచి సిరిమానును తొలుత చదురుగుడికి తరలించనున్నారు. ఆపై ప్రత్యేక పూజల అనంతరం పూజారి సిరిమానుపై ఆశీనులవుతారు. అనంతరం చదురుగుడి నుంచి కోట వరకూ సిరిమాను మూడు పర్యాయాలు తిరిగే ప్రక్రియ మొదలవుతుంది.

విజయనగరం కల్చరల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి):

విజయనగరం పండగ శోభను సంతరించుకుంది. ఎటు చూసినా అమ్మవారికి మొక్కుబడులు చెల్లించేందుకు వచ్చే భక్తులు, సిరిమానోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు, విద్యుత్‌ వెలుగులు, ప్రజల కేరింతలే కనిపిస్తున్నాయి. అసలు సంబరానికి ముందు జరిగే తొలేళ్లను పురస్కరించుకుని సోమవారం ఎక్కడికక్కడే పులివేషాలు, కత్తిసాము, కర్రసాము ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిరి సంబరం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సాయంత్రం 5 గంటల్లోపు సిరిమాను సంబరం ముగిసేలా ముందస్తుగానే అధికారులు ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.శిరీష, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలాస్వామి పర్యవేక్షణలో సిరిమానోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పైడిమాంబ ఉత్సవాల ప్రత్యేకాధికారిగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్‌ను దేవదాయశాఖ నియమించింది. ఎప్పటికప్పుడు హుకుంపేట నిర్వాహకులతో మాట్లాడి ఎన్ని గంటలకు సిరిమాను తరలించాలి? ఎవరెవరు ఇందులో ఉంటారన్న విషయాలపై వారితో చర్చించారు. భక్తులు ఉదయం 10 గంటల్లోపే సిరిమాను వద్ద పూజలు ముగించాలని కోరారు. సిరిమాను, ఇరుసుమాను సిద్ధం చేసే పనులను రెవెన్యూ, అటవీశాఖ, పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఫ హుకుంపేట నుంచి చదురుగుడికి సిరిమాను తరలించి అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం మూడు గంటల తరువాత సిరిమానోత్సవాన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్లల్లో కోల్‌కతాకు చెందిన ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో 10 చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫ పైడిమాంబ సిరిమానోత్సవానికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది. స్థానిక ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ తంతు జరగకూడదు. దీంతో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి దంపతులు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య పైడిమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ప్రముఖులు రాక

సిరిమానోత్సవానికి ప్రముఖులు రానున్నారు. గోవా గవర్నర్‌, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, రాష్ట్రంలో వివిధ హోదాల్లో వున్న అధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిక సంఖ్యలో రానున్నారు. వీరంతా అమ్మవారి దర్శనానంతరం సిరిమానోత్సవాన్ని తిలకించనున్నారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన అదితి

విజయనగరం రూరల్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తొలేళ్ల ఉత్సవంలో భాగంగా మాన్సాస్‌ ట్రస్టు తరుపున పైడిమాంబకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత కోటలోని ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి, కోటశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి విద్యావతి దేవి, వారి కుటుంబ సభ్యులు కోట నుంచి ఊరేగింపుగా అమ్మవారి చదురుగుడికి చేరుకున్నారు.

-----------

వైభవంగా తొలేళ్లు

ఎటుచూసినా భక్తజనం

రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన పూజారి

విజయనగరం రూరల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ తొలేళ్ల ఉత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఎటు చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పక్క రాష్ర్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తొలేళ్ల ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటి నుంచి ఘటాల ఊరేగింపు తంతు జరిగింది. చదురుగుడిలో పూజలు చేసిన అనంతరం ఆ ఘటాల ఊరేగింపు కోట వరకూ సాగింది. కోట శక్తి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం వెండి బిందెలతో కూడిన ఘాటాలను చదురుగుడి ఎదురుగా వుంచారు. రాత్రి 12 గంటల తర్వాత పూజారి బంటుపల్లి వెంకటరావు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాల కోసం రైతులు పోటీ పడ్డారు.

ఫ పైడిమాంబను సిరిమానోత్సవానికి సిద్ధం చేస్తూ, రాత్రి 12 గంటల సమయంలో వివిధ నదీజలాలతో అర్చన నిర్వహించారు. కొంత మంది ప్రముఖులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పరిమిత సంఖ్యలో వుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Oct 27 , 2026 | 12:23 AM