‘సర్’ను వంద శాతం పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:45 PM
: జిల్లాలో సర్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్, అండర్ సెక్రటరీ సంజీవ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
- కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అవినాష్, సంజీవ్
పార్వతీపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సర్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్, అండర్ సెక్రటరీ సంజీవ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ వైశాలితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరో నాలుగు రోజులు గడువు ఉన్నందున అధికారులు, సిబ్బంది సమన్వయంతో సర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వీఆర్‌వోలు కీలకపాత్ర పోషించాలని, ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, అనర్హుల పేర్లు తొలగించాలని స్పష్టం చేశారు. తక్కువ నమోదు జరిగిన పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పాలకొండ ప్రాంతంపై దృష్టిసారించి ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రోజుకు కనీసం 40 వేల ఫారాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా దరఖాస్తుల డిజిటలైజేషన్ పురోగతిని వివరించి శనివారం నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌వో హేమలత, ఆర్డీవో మాధురి, నాలుగు నియోజకవర్గాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
- జిల్లాలో సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలని, అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.