Share News

అయ్యా బాగున్నావా?

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:20 AM

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు, నాయకుల ప్రచార శైలీ మారింది. ప్రజలకు ఎదురెళ్లి మరీ పలకరిస్తున్నారు.

అయ్యా బాగున్నావా?

- అమ్మా ఆరోగ్యం ఎలా ఉంది?

- మారిన అభ్యర్థుల ప్రచార శైలీ

- ప్రజలకు ఎదురెళ్లి మరీ పలకరిస్తున్న వైనం

- గ్రామాలు, పట్టణాల్లో సందడి

- అయ్యా బాగున్నావా? ఆ మధ్యన ఇంట్లో సమస్య ఉందని చెప్పావు. ఏంటది..చెబితే చూస్తాను. అదే పిల్లాడికి సంబంధించి ఆ కేసే కదా? వారితో నేను మాట్లాడతాను. అవసరం అయితే నేనే వస్తాను. సమయం చూసుకొని వెళదాం.

- ఏమమ్మా అనారోగ్యంతో బాధపడుతున్నావట. ఆస్పత్రికి వెళ్లావా? లేకుంటే తీసుకెళ్లమంటావా? ఇదిగో మందుల ఖర్చుకు పనికి వస్తుంది ఉంచు. మావారితో చెప్పి మంచి డాక్టరును చూపిస్తాను. మంచి మందులు వాడుదువు.

- ఏమమ్మా కొత్త పింఛన్‌కు పెట్టావా? నేను చూసుకుంటాను. కచ్చితంగా నీకు కొత్త పింఛన్‌ వచ్చి తీరుతుంది. అంతా మన చేతిలో ఉంటుంది. మంజూరవుతుంది లే. మనవాళ్లందరికీ పింఛన్లు వస్తాయి. ఎటువంటి భయం పెట్టుకోవద్దు.

విజయనగరం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు, నాయకుల ప్రచార శైలీ మారింది. ప్రజలకు ఎదురెళ్లి మరీ పలకరిస్తున్నారు. అయ్యా ఎలా ఉన్నావ్‌?.. అమ్మా ఆరోగ్యం ఎలా ఉంది.. తమ్ముడూ ఎక్కడ జాబ్‌ చేస్తున్నావ్‌? అంటూ ఇలా కనిపించిన వారందరి దగ్గరికి వెళ్లి కుశల ప్రశ్నలు వేస్తున్నారు. పలకరింపులతో పాటు ప్రత్యేక హామీలు, అభయహస్తాలు ఇస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. రోజంతా ప్రచారాలు, రాత్రిపూట సమావేశాలతో అభ్యర్థులు గడుపుతున్నారు. ఇప్పటివరకూ సామాన్య జనాలను అంతగా పట్టించుకోని నేతలు ఓట్ల పుణ్యమా అని ప్రత్యేకంగా పలకరిస్తుండడం విశేషం.

గ్రామాల్లో ఇవే పట్టింపులు

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పలకరింపులు, పరామర్శలనే ప్రజలు ఎక్కువగా పట్టించుకుంటారు. అందుకే ఇప్పుడు పురుడ్లు, శుభకార్యాలు, పరామర్శలంటేనే నేతలు వాలిపోతున్నారు. గతంలో ఎదురుగా కనిపిస్తే మాట్లాడని వారు సైతం ఎదురెళ్లి పలకరిస్తున్నారు. వారితో సన్నిహితంగా ఉండే వారి ద్వారా కలుస్తున్నారు. ‘మీ కష్టం మాది’ అంటూ భరోసా ఇస్తున్నారు. మీ కులం వారికి కమ్యూనిటీ హాల్‌..మీ వర్గం వారికి ఇది ప్రయోజనం.. మీ వారికి భవిష్యత్‌లో కల్పించబోయే చాన్స్‌ ఇది అంటూ హామీ ఇస్తున్నారు. కులం, మతం, వర్గం అంటూ విడదీసి ఓటు లెక్కలు కడుతున్నారు. మీ వీధికి అభివృద్ధి పనులు చేపడతాం.. రోడ్లు ఇస్తాం.. సామాజిక భవనాలు కేటాయిస్తాం అంటూ హామీల మీద హామీలు ఇస్తున్నారు. చావు పుట్టుకల వద్ద ఇప్పుడు నేతలు కనిపిస్తుండడం మాత్రం నిజంగా విశేషమే.

దగ్గరుండి మాట్లాడిస్తున్న కార్యకర్తలు

ఫోన్‌ పలకరింపుల విషయంలో ఇక చెప్పనవసరం లేదు. నేతలు, అభ్యర్థులు ఖాళీ దొరికితే చాలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఓటును అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు, నేతల చుట్టూ కార్యకర్తలు చేరుతున్నారు. ఫలానా వాడితో మాట్లాడి ఉంటే బాగుండేది అని చెబుతున్నారు. వారే ఫోన్‌ నంబర్‌ కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వలసకూలీలపై నేతలు, అభ్యర్థుల దృష్టిపడింది. అక్కడి వారితో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఇక ఓటర్ల జాబితాలను చేతిలో పెట్టుకొని నేరుగా కాంటాక్ట్‌ అవుతున్న వారు ఉన్నారు. ముందుగానే వారికి చెల్లింపులు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉంటే అక్కడి నుంచి వచ్చేందుకు వీలుగా బస్సులు, వాహనాలను బుక్‌ చేస్తున్నారు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం వారికి కొంత మొత్తం చెల్లింపులు కూడా చేస్తున్నారు. అంతా డిజిటల్‌ పే కావడంతో క్షణాల్లోనే ఈ తతంగం జరిగిపోతోంది.

Updated Date - Oct 24 , 2026 | 12:20 AM