Share News

సర్‌.. డర్‌

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:26 AM

ఓటరు జాబితాలో ఉన్న ఇలాంటి తప్పులను సరి చేసే పనిలో ఎన్నికల కమిషన్‌ పడింది.

   సర్‌.. డర్‌

-రాజకీయ పార్టీలను భయపెడుతున్న వైనం

- మద్దతుదారుల ఓట్లను తొలగిస్తారని అనుమానం

- అవన్నీ అపోహలేనని అంటున్న ఎన్నికల అధికారులు

- తప్పుల్లేని జాబితాను తయారు చేస్తామని ప్రకటన

-15 నుంచి జిల్లాలో ‘సర్‌’ ప్రక్రియ

- శృంగవరపుకోట శ్రీనివాసకాలనీకి చెందిన అప్పలరాజు గత సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ బూత్‌లో ఓటేశాడు. ఇతని భార్య లక్ష్మి చింతబడి పోలింగ్‌ బూత్‌లో, కుమారుడు రమణ బర్మాకాలనీ ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఒకే కుటుంబానికి చెందిన వీరి ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదై ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులే కారణమంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు.

-వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన వెంకటరమణ పేరు ఓటరు జాబితాలో రమణగా నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ బూత్‌కు వెళ్లాడు. ఇతను ఓ పార్టీ మద్దతుదారు కావడంతో వేరే పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ) ఆయన్ను అడ్డుకున్నాడు. ఇతనిపేరు రమణ కాదని వెంకటరమణనని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఓటరు గుర్తింపు కార్డులో కూడా వెంకటరమణగా ఉండడంతో ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించలేదు. తనపేరు ఓటరు జాబితాలో తప్పుగా పడిందని ఆయన చెప్పినా వినిపించుకోలేదు. బీఎల్‌ఏల అంగీకారం ఉంటే తప్ప తామేమి చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఓటేయకుండానే ఆయన వెనుతిరిగాడు.

శృంగవరపుకోట జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో ఉన్న ఇలాంటి తప్పులను సరి చేసే పనిలో ఎన్నికల కమిషన్‌ పడింది. దీనికోసం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ప్రత్యేక విస్తృత సవరణ) కార్యక్రమం నిర్వహిస్తోంది. దీన్నే ‘సర్‌’ (ఎస్‌ఐఆర్‌) అని పిలుస్తున్నారు. తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేసేందుకు ఈనెల 15 నుంచి బూత్‌ లెవల్‌ అధికారులను ఈసీ ఇంటింటికీ పంపించనుంది. ఇప్పుడీ ‘సర్‌’ పేరు వింటేనే రాజకీయ పార్టీలకు వణుకుపుడుతుంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలమైన ఓటర్లను తొలగిస్తారేమోనని భయపడుతున్నాయి. ఈ ఓట్లు అధికార పక్షానికి పోతాయేమోనన్న అనుమానం ప్రతిపక్షల్లో ఉంది. ఇవన్నీ రాజకీయ పార్టీల అపోహలేనని ఎన్నికల అధికారులు కొట్టిపారేస్తున్నారు.

ప్రధాన పార్టీలు అప్రమత్తం..

ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ‘సర్‌’ ప్రభావం పడిందన్న ప్రచారం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా భోగస్‌ లేదా మరణించిన వారి వారి ఓట్లను తొలగింపుతో పాటు సాధారణ ఓటర్ల పేరు కూడా తొలగిపోతున్నాయని, దీనివల్ల తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నిర్దిష్ట వర్గాల ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నాయని, దీనివల్ల తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటున్నాయని అంటున్నాయి. కొత్తగా నమోదైన ఓట్లు ఏ పార్టీకి వెళ్లిపోతాయోనని భయపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ బీఎల్‌ఏలను అప్రమత్తం చేశాయి. పార్టీకి చెందిన ఓటర్లను కాపాడుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందుకు గాను తమ ఏజెంట్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాయి. ప్రతీ నియోజకవర్గానికి బాధ్యులను ఏర్పాటు చేశాయి. బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) సర్వే కోసం ఇంటింటికీ వెళ్లినప్పుడు వారి వెంట బీఎల్‌ఏలు కూడా వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఆ సమయంలో ఇంటి వద్ద ఓటర్లు లేకపోతే వారిని అప్పటికప్పుడు పిలిపించడంతో పాటు బీఎల్‌వోలు అడిగే ఆధారాలన్నీ చూపించేందుకు బీఎల్‌ఏలు సిద్ధమవుతున్నారు. కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే దగ్గర ఉండేలా చూడడం.. పేరు, ఇంటిపేరు, ఫొటో అన్ని సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. వలస ఓటర్లు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఓటును కలిగి ఉండాలని, రెండు చోట్ల నమోదు చేసుకోకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ ఓటర్లు ఇంటి వద్ద లేకపోతే బూత్‌లెవల్‌ అధికారులు మూడు దపాలు ఆ ఇంటికి వెళ్తారు. ఏదో ఒక సమయంలో ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే మండలాల వారిగా వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల అధికారులు సమావేశమయ్యారు. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఓటరు జాబితాలో పేర్లు తప్పులు లేకుండా ఉండేందుకు పదో తరగతి సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీంతో పాటు ఫొటోలను సేకరించనున్నారు. కొత్త ఓటర్లను వారి తల్లిదండ్రుల కుటుంబంలో చేర్చనున్నారు. వీటన్నిటిని ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో మ్యాపింగ్‌ చేయనున్నారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.

‘సర్‌’ షెడ్యూల్‌ ఇలా..

జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) ఇంటింటా సర్వే.

జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ.

జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ.

ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 18 వరకు నోటీసుల జారీ, క్లెయిమ్‌ల పరిష్కారం.

సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ.

Updated Date - Jun 13 , 2026 | 12:26 AM