Share News

Sir CM.. Here it is! సీఎం సార్‌.. ఇవిగో!

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:55 PM

Sir CM.. Here it is! జిల్లా అభివృద్ధికి సంబంధించి బుధవారం కీలక అడుగు పడే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఎమ్మెల్యేలకు ఇప్పటికే సమాచారం అందింది. వారు మంగళవారం అమరావతికి బయలుదేరి వెళ్లారు.

Sir CM.. Here it is! సీఎం సార్‌.. ఇవిగో!

సీఎం సార్‌.. ఇవిగో!

కీలక ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి ముందుకు

పరిష్కారం దొరుకుతుందన్న ఆశలో ప్రజాప్రతినిధులు

నేడు చంద్రబాబునాయుడితో ఎమ్మెల్యేల భేటీ

విజయనగరం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి):

జిల్లా అభివృద్ధికి సంబంధించి బుధవారం కీలక అడుగు పడే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఎమ్మెల్యేలకు ఇప్పటికే సమాచారం అందింది. వారు మంగళవారం అమరావతికి బయలుదేరి వెళ్లారు. అయితే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రత్యేక ఆర్థిక భారం లేని మూడు సమస్యలు, నిధులతో ముడిపడిన మూడింటిపై సమగ్ర సమాచారంతో రావాలని సీఎంవో అధికారులు సూచించారు. ఆ మేరకు ఎమ్మెల్యేలు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించారు. వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.

- గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కీలక ప్రతిపాదనలు చేయనున్నారు. దత్తిరాజేరు మండలం దత్తిలో రూ.27.50 కోట్లతో సారవగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని కోరనున్నారు. నియోజకవర్గంలో 27,420 ఇళ్లకు నీటి కుళాయిలకు సంబంధించి రూ.455.84 కోట్లు, గంట్యాడ మండలం గింజేరు సమీపంలోని డొంకలగెడ్డ వద్ద రూ.82.66 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించాలని కోరనున్నారు.

- రాజాం నియోజకవర్గం: రాజాం మున్సిపాల్టీలో పారిశుధ్యం బాగాలేదు. చంద్రబాబు గతంలో ప్రజలకు మాటిచ్చినట్లు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయాలంటే రూ.65 కోట్లు అవసరం. దీనికి సంబంధించి సమగ్ర వివరాలను ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అందించనున్నారు. ప్రస్తుతం రాజాంలో ప్రభుత్వ జూనియర్‌ మహిళలు, పురుషుల కాలేజీ ఉంది. డిగ్రీకాలేజీ సైతం కొనసాగుతోంది. ఇక్కడ పీజీ కాలేజీ మంజూరు చేయాలని కోరనున్నారు. అదే విదంగా విజయనగరం - పాలకొండ నాలుగు రోడ్లు విస్తరణ చేపట్టాలని కోరనున్నారు.

- చీపురుపల్లి నియోజకవర్గం: ఆర్‌ఈసీఎస్‌ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని ఎమ్మెల్యే కళావెంకట్రావు ప్రస్తావించనున్నారు. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అదనపు భవనాల నిర్మాణం కోసం నిధులు, నియెజకవర్గంలో రోడ్లు అభివృద్ధిపైనా మాట్లాడనున్నారు. గరివిడి పశువైద్య కాలేజీలో 18 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, 178 మంది సిబ్బంది అవసరమని సీఎంకు ప్రత్యేకంగా విన్నవించనున్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కుడి ప్రధాన కాలువను పూర్తిచేయడానికి రూ.21.25 కోట్లు, చీపురుపల్లి ప్రాంతీయ ఆస్పత్రి అభివృద్ధికి రూ.34.50 కోట్లు కావాలని కోరనున్నారు.

- బొబ్బిలి నియోజకవర్గం: సాగునీటి సమస్యను విన్నవించేందుకు ఎమ్మెల్యే బేబీనాయన నిర్ణయించుకున్నారు. ప్రధానంగా తెర్లాం మండలంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ పరిధిలోని 1732 ఎకరాలకు సాగునీరు అందించేందుకు లోచర్ల ఎత్తిపోతల పథకం, 2,593 ఎకరాలను సస్యశ్యామలం చేసే రాముడువలస పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేయనున్నారు. ముఖ్యంగా పారాది వద్ద వేగవతి నదిపై నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్‌ రోడ్డు మంజూరు చెయ్యాలని కోరనున్నారు.

- విజయనగరం నియోజకవర్గం: ప్రధానంగా తాగునీటి సమస్యను ఎమ్మెల్యే అతిది గజపతిరాజు విన్నవించనున్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ చేపడితేనే విజయనగరానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం చూపగలమని ప్రతిపాదించనున్నారు. విజ్జీ స్టేడియంలో అసంపూర్తిగా ఉన్న క్రీడా పాఠశాల నిర్మాణానికి రూ.34 కోట్లు అంచనా.. పైడితల్లమ్మ ఉత్సవానికి రూ.2 కోట్లు కావాలని విన్నవించనున్నారు. చిట్టిగురువు కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నారు.

- శృంగవరపుకోట నియోజకవర్గం: జామి మండలం అలమండ, భీమసింగి గ్రామాల వద్ద ఆర్‌ అండ్‌ బి రోడ్లపై వంతెనల నిర్మాణాలకు నిధులు, ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చే జలజీవన్‌ మిషన్‌ ద్వారా నిధులు కేటాయించాలని సీఎంను ఎమ్మెల్యే లలితకుమారి కోరనున్నారు. వీటితో పాటు కొత్తవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తవలస కోర్టుభవనాలకు నిధులు కోరే అవకాశం ఉంది.

-------------------------

Updated Date - Apr 07 , 2026 | 11:55 PM