Share News

పద్యాలు పాడుతూ.. పూలబాణాలు ఎక్కుపెడుతూ

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:43 AM

పూర్వం దసరా వచ్చిందంటే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎంతో సందడిగా ఉండేది.

పద్యాలు పాడుతూ.. పూలబాణాలు ఎక్కుపెడుతూ
దసరా పాటలు పాడుతున్న విద్యార్థులు

జీరికవలసలో విద్యార్థుల సందడి

గుర్తుకొచ్చిన నాటి దసరా సంప్రదాయం

చొరవచూపిన ఉపాధ్యాయులు

మురిసిపోయిన గ్రామ పెద్దలు

మెంటాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పూర్వం దసరా వచ్చిందంటే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎంతో సందడిగా ఉండేది. ముఖ్యంగా పిల్లలు ఈ పండుగ కోసం ఎదురుచూసేవారు. కొత్త దుస్తులు ధరించి, పూల ధనస్సులు చేతపట్టుకుని ఉపాధ్యాయుల వెంట ఊరంతా తిరిగేవారు. ‘అల్లంతా దూరాన అద్దాల మేడ’.. ‘ఏదయా మీ దయా మా మీద లేదు.. అయ్యవారికి చాలు ఐదు వరహాలు.. పిల్లలకి చాలు పప్పు బెల్లాలు’ అంటూ ఇలా ఎన్నో పద్యాలు, పాటలు పాడేవారు. పద్యం చివర విజయీభవ.. దిగ్విజయీభవ అంటూ పూల బాణాలు వేస్తూ ఆశీర్వచనాలు అందించేవారు. కాలక్రమంలో నాటి సందడి కనుమరుగైంది. ఇలాంటి సమయంలో లోతుగెడ్డ పంచాయతీ మధుర జీరికవలస గ్రామంలో నాటి దసరా సంప్రదాయం పునర్జన్మనెత్తింది. కనులముందు కదలాడిన పాతకాలపు పండుగ కళ మళ్లీ కనిపించింది. స్థానిక ఉపాధ్యాయుల చొరవతో బడి పిల్లలు రంగురంగుల బాణాలను చేతపట్టుకొని గ్రామ వీధుల్లోకి అడుగుపెట్టారు. ఉపాధ్యాయులు ముందు నడుస్తుండగా...వారి పర్యవేక్షణలో విద్యార్థులు ప్రతి ఇంటి ముంగిట నిలబడి రాగయుక్తంగా దసరా పద్యాలు పాడుతుంటే, ఆ వీధులన్నీ పులకించిపోయాయి. పిల్లల చేతిలోని విల్లంబులు, వారి పెదవుల నుంచి జాలువారిన పద్యాలు, పాటలు వినగానే ఊరిలోని వృద్ధులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తమ పాతరోజులు, చిన్ననాటి దసరా జ్ఞాపకాలు కళ్లముందు కదలాడడంతో వారి కళ్లు ఆనంద భాష్పాలతో తడిసిపోయాయి. మురిసిన గృహస్తులు పిల్లలను ఆత్మీయంగా ఆహ్వానించి, వారికి పండ్లు, సంభావనలు అందించి దీవించారు. ఉపాధ్యాయుల చొరవపై గ్రామస్థులు, విద్యాభిమానులు ప్రశంసలు కురిపించారు. సంస్కృతిని కాపాడుకునే ఇలాంటి ఆదర్శవంతమైన ప్రయత్నాలు ప్రతి గ్రామంలోనూ జరగాలని ఆకాంక్షించారు.

నేటి తరానికి కొత్త అనుభూతి

డిజిటల్‌ యుగంలో స్ర్కీన్లకే పరిమితమవుతున్న నేటి తరానికి మన సంస్కృతి, సంప్రదాయాల విలువను తెలపడమే మా లక్ష్యం. ఈ తరం పిల్లలకు ఇది ఒక కొత్త అనుభూతి అయితే, పెద్దలకు మధురమైన జ్ఞాపకాల పయనం.

-రెడ్డి అప్పలనాయుడు ఉపాధ్యాయుడు, జీరికవలస

కొత్తగా ఉంది..

ఇది చాలా కొత్తగా, సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు చెప్పినపుడు కాస్త కంగారు పడ్డాం. చేయగలమా లేదా అని సంకోచించాం. కానీ, ఊర్లోవాళ్లు శెభాష్‌ అంటుంటే కళ్లల్లో నీళ్ళు వస్తున్నాయి. మా తాతలు చెప్పిన పండగను మేము స్వయంగా చేస్తున్నాం.

-రామారావు, విద్యార్థి

సరదా అనిపించింది

అంతా కొత్తగా అనిపించింది. అసలు కాగితపు బాణాలు ఉంటాయని, పూర్వం వాటితో ఇంటింటికీ తిరిగేవారని మాకు తెలీదు. మా మాస్టార్లు మావెంట వచ్చి చేయిస్తుంటే ఎక్కడలేని సరదా అనిపించింది. ఇకముందు కూడా ఇలాగే చేస్తాం.

-రమేష్‌, విద్యార్థి

బాల్యంలోకి తీసుకెళ్లారు

మా రోజుల్లో దసరా అంటే పిల్లల పండగ. పది రోజుల ముందు నుంచే గ్రామం మొత్తం చిన్నారుల కేరింతలతో మార్మోగిపోయేది. దసరా సెలవులు వస్తే చాలు మాకు గుర్తుకొచ్చేది బాణాల సందడే. చేతిలో రంగురంగుల కాగితపు బాణాలు ఉండేవి. నోటిలో ‘ఏదయా మీ దయా పాట’ నానేది. ఆరోజులు మళ్లీ చూడమేమో అనుకున్నాం. మా ఊరి టీచర్లు మమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్లారు. వారికి ధన్యవాదాలు.

-భీమారావు, మాజీ సర్పంచ్‌, లోతుగెడ్డ పంచాయతీ

Updated Date - Oct 17 , 2026 | 12:43 AM