Unity ఐక్యత చాటారు
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:02 AM
Showed Unity కలిసి ఉంటే.. విజయం ఖాయమని నిరూపించారు కూటమి అభ్యర్థులు. పురపోరుకు నగారా మోగిన దగ్గర నుంచి సమిష్టిగా పనిచేసి విజయఢంకా మోగించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ .. విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక స్థానాల్లో గెలుపొందారు.
పురపోరులో సత్తాచాటిన కూటమి అభ్యర్థులు
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో అద్భుత విజయం
పార్వతీపురం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కలిసి ఉంటే.. విజయం ఖాయమని నిరూపించారు కూటమి అభ్యర్థులు. పురపోరుకు నగారా మోగిన దగ్గర నుంచి సమిష్టిగా పనిచేసి విజయఢంకా మోగించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ .. విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. పార్వతీపురం, సాలూరు, పాల కొండలో టీడీపీ, జనసేన చైర్పర్సన్ అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకున్నారు. కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు కూడా సత్తాచాటారు.
సాలూరులో...
స్థానిక పరిస్థితుల కారణంగా సాలూరు పురపాలక సంఘంలో కూటమి నాయకులు పొత్తు ధర్మం పాటించలేదు. అయినప్పటికీ ప్రజలు జనసేన చైర్పర్సన్ అభ్యర్ధి జనసేనకు గొర్లె విజయకుమారికి ఓటర్లు పట్టం కట్టారు. 296 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. సాలూరులో 27,526 ఓట్లు పోలవ్వగా అందులో 26,124 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. స్థానిక నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ పుర ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో కూటమి అభ్యర్థులను గెలిపించారు. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులపై కూటమి అధిష్ఠానాలు దృష్టి సారించాల్సి ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగిల్సి ఉందనే వ్యాఖ్యలు వినిస్తున్నాయి.
పాలకొండలో...
పాలకొండ: నగర పంచాయతీలో కూటమి పార్టీల ఐక్యత వల్ల జనసేన చైర్పర్సన్ అభ్యర్థి పల్లా విజయనిర్మల 6,629 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 10,859 ఓట్లు పడ్డాయి. కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు 23 వార్డుల్లో విజయం సాధించారు. నాలుగు వార్డులకే వైసీపీ పరిమితమైంది. 28 వార్డుల్లో జనసేన 12, టీడీపీ 10, వైసీపీ 4, బీజేపీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 4230 ఓట్లు , స్వతంత్రులకు 459 ఓట్లు వచ్చాయి. ఎన్నికలకు ముందు పాలకొండలో కూటమి పార్టీల నేతల మధ్య కాస్త మనస్పర్థలు ఉన్నప్పటికీ ఫలితాలపై ఆ ప్రభావం పడలేదు. ఐక్యతగా పనిచేసి కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ప్రధానంగా వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా పాలవలస ఇందుమతి బరిలో ఉండడంతో కూటమి నాయకులంతా మరింత కష్టపడ్డారు. త్వరలో కొలువుదీరనున్న పాలకవర్గం కూర్పులోనూ వారంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా పాలకొండ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న డంపింగ్యార్డు సమస్య, మురుగు కాలువలు నిర్వహణపై నూతన పాలకవర్గ సభ్యులు దృష్టి సారించాల్సి ఉంది. ప్రధాన రహదారి విస్తరణ పనులు , పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పన్నులు , పారిశుధ్యం, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
పార్వతీపురంలో ఇలా..
- పార్వతీపురం టౌన్: పార్వతీపురం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఐక్యతతో ముందుకు సాగి ప్రజల మనసులను గెలుచుకున్నారు. ప్రతిపక్ష వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులను సైతం చాకచక్యంగా ఎదుర్కొని పుర పీఠం దక్కించుకున్నారు. మున్సి పాలిటీలో టీడీపీ 24, వైసీపీ 6, జనసేన 2, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. 4,988 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి బెలగాం కరుణ గెలుపొందారు. వాస్తవంగా పట్టణంలోని 32 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. జనసేనకు మూడు వార్డులు, బీజేపీకి ఒక వార్డు కేటాయించి.. వారి గెలుపుకోసం కూటమి శ్రేణులు శ్రమించి విజయం సాధించారు. 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి వలిరెడ్డి పార్వతి, 5వ వార్డులో జనసేన అభ్యర్థి మజ్జి శ్రీరమ్య గెలవడంతో 2, 3, 4, 6 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు ఒక మార్గం ఏర్పడింది.
- కొన్నిచోట్ల పొత్తు ధర్మం పాటించలేదు. పలు వార్డుల్లో జనసేన, టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడంతో కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనా పార్వతీపురంలో అత్యధిక కౌన్సిలర్ స్థానాలకు కూటమి ఖాతాల్లోకి వెళ్లాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి 10728 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 181, ఇతరులకు 483 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 27,102 ఓట్లు పోలయ్యాయి.
కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం
కొత్త పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అదేవిధంగా పలు సవాళ్లను ఎదుర్కోక తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత వైసీపీ సర్కారు పాలనలో పట్టణ అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. చెప్పుకోదగ్గ పనులేవీ చేపట్టలేదు. ప్రధాన ప్రజా సమస్యలను పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో త్వరలో కొలువుదీరనున్న నూతన పాలకవర్గ సభ్యులు పట్టణంలోని 36 వార్డులపై దృష్టి సారించాల్సి ఉంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీరు, పారిశుధ్య, వీధిదీపాల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
వాస్తవంగా 2014-2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.33.33 కోట్లతో పట్టణంలో బృహత్తర తాగునీటి పథకాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. 2017లో పనులు ప్రారంభ మయ్యాయి. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులకు బ్రేక్ పడింది. వైసీపీ పాలకులుతాగునీటి పథకానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ.66.66 కోట్లు కేటాయించినా పనులేవీ చేపట్టలేకపోయారు. ప్రజల తాగునీటి కష్టాలను తీర్చలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటి సరఫరాకు రూ.80 కోట్లు కేటాయించింది. దీని పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా నూతన పాలకవర్గం చొరవ చూపాల్సి ఉంది. అదేవిధంగా డంపింగ్ యార్డు తరలింపుతో పాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. పట్టణ జనాభా రోజురోజుకూ పెరు గుతోంది. శివారు ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కాలనీలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో తాగునీటి సరఫరాతో పాటు పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణను గాడిలో పెట్టాల్సిన బాధ్యత నూతన పాలకవర్గంపై ఉంది.